
దీపావళి తర్వాత ఈశాన్యం బలం
– 22న అధికారులతో సీఎం భేటీ
సాక్షి, చైన్నె : దీపావళి తర్వాత రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు బలపడుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వర్షాలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై ఈనెల 22వ తేదీన అధికారులతో సీఎం స్టాలిన్ సమీక్షించనున్నారు. ఈశాన్య రుతు పవనాలు గురువారం రాష్ట్రాన్ని తాకిన విషయం తెలిసిందే. పశ్చిమ కనుమలు, దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతం అయ్యింది. అక్కడక్కడ చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల చిరు జల్లులు అప్పుడప్పుడు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పవనాలు రాష్ట్రంలో దీపావళి తర్వాత బలపడతాయని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు బయలు దేరే అవకాశాలు ఉన్నాయని, ప్రధానంగా ఉత్తర తమిళనాడులోని చైన్నె, శివారు జిల్లాలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురస్తాయని ప్రకటించారు. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లు, ఇక ముందు చేపట్టాల్సిన పనుల గురించి ఉన్నత స్థాయిలో అధికారులు, జిల్లాల వారీగా అధికారులతో సమావేశానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఈసమావేశంలో ఈనెల 22వ తేది జరగనున్నది.