
మేయర్ ఇంద్రాణి రాజీనామా ఆమోదం
సాక్షి, చైన్నె : మదురై కార్పొరేషన్ మేయర్ ఇంద్రాణి రాజీనామాను ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే, ఇటీవల ఆమె భర్త పొన్ వసంత్‌తోపాటు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పలువురిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో డీఎంకే అధిష్టానం రాజీనామా చేయాలని ఆదేశించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం డిప్యూటీ మేయర్ నాగరాజన్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆమె రాజీనామాను ఆమోదించారు. అదే సమయంలో అవినీతి పరులను శిక్షించాలన్న నినాదం సమావేశంలో మార్మోగింది. రాజీనామా ఆమోదం తరువాత సభను వాయిదా వేశారు. అయితే ప్రజా సమస్యలపై చర్చించాలంటూ అన్నాడీఎంకే సభ్యులు పట్టుబట్టడంతో సమావేశ మందిరంలో కాసేపు ఉత్కంఠ నెలకొంది. మేయర్ రాజీనామా ఆమోదంతో కొత్త మేయర్ ఎవరన్న చర్చ డీఎంకేలో బయలు దేరింది. డీఎంకే అధిష్టానం ఎవరిపై కరుణ చూపుతుందోనని కార్పొరేటర్లరు ఎదురుచూస్తున్నారు.