
రంగంలోకి సీబీఐ
సాక్షి, చైన్నె : కరూర్ పెను విషాద ఘటనపై విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. గుజరాత్‌కు చెందిన అధికారి నేతృత్వంలో ఆరుగురితో కూడిన సీబీఐ బృందం శుక్రవారం కరూర్‌లో విచారణను ప్రారంభించింది. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ గత నెల 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ప్రచారంలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 160 మంది గాయపడ్డారు. తొలుత మద్రాసు హైకోర్టు నేతృత్వంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం కేసును విచారించగా, చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. గుజరాత్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో ఏడీఎస్పీ ముఖేష్‌కుమార్, డీఎస్పీ రామకృష్ణన్‌తో సహా ఆరుగురు బృందం సీబీఐలో ఉన్నారు. ఈ బృందం కరూర్‌కు చేరుకుంది. కేసుకు సంబంధించిన సమగ్ర వివరాల పరిశీలనలో నిమగ్నమైంది. తొలుత కరూర్ పోలీసులు, ఆ తదుపరి ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం జరిపిన విచారణకు సంబంధించిన సమగ్ర వివరాల నివేదికను తమ వశం చేసుకుని, అందులోని అంశాల పరిశీలనతో సంఘటనా స్థలం నుంచి విచారణకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించారు. ప్రాథమికంగా ఈ బృందం తన విచారణను ప్రారంభిస్తూ, అక్కడి అధికారులతో సమావేశమైంది. ఇదిలా ఉండగా, కరూర్‌కు చెందిన టీవీకే నేతలు ఒకొక్కరు బయటకు వస్తున్నారు. వీరంతా చైన్నెకు చేరుకుని పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో సమావేశం కావడం గమనార్హం. దీపావళి తర్వాత విజయ్ కరూర్‌లో బాధితులను పరామర్శించేందుకు నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లు గురించి చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి.