ఘనంగా అన్నాడీఎంకే ఆవిర్భావోత్సవం
వాడవాడలా పార్టీ జెండా ఆవిష్కరణ సేవల జోరు దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితకు నివాళి ప్రధాన కార్యాలయంలో పళణి నేతృత్వంలో వేడుక రేపు మనదే అన్న ధైర్యంతో అడుగు వేద్దామని పిలుపు
పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన కొన్ని సంఘటనలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి ఘటనలు నెమరు వేసుకోవడానికి వార్షికోత్సవం జరుపుకుంటారు. ఆ దిశగా అన్నాడీఎంకే 54వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పార్టీ సారథులు ఎంజీఆర్, జయలలితకు నివాళులర్పించారు. వాడవాడలా పార్టీ పతకాలు ఎగురువేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించి, స్వీట్లు పంచుకుని, అన్నదానాలు చేశారు.
సాక్షి, చైన్నె : అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఆవిర్భవించి శుక్రవారంతో 54 సంవత్సరాలు అయింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నాడీఎంకే వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాయి. వాడ వాడలా పార్టీ జెండాలను ఎగుర వేశారు. విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత విగ్రహాలు, చిత్ర పటాల వద్ద నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై మరణానంతరం డీఎంకేలో విభేదాలతో నెలకొన్న పరిణామాలు అన్నా డీఎంకే ఆవిర్భావానికి పరిస్థితులు కల్పించిన విషయం తెలిసిందే. కరుణానిధితో ఏర్పడిన వైర్యంతో 1972 అక్టోబరు 17వ తేదీన అన్నాడీఎంకేను పురట్చి తలైవర్ ఎంజీఆర్ ప్రకటించారు. ఆయన మరణంతో పార్టీలో చీలిక వచ్చినా, చివరకు తన భుజస్కందాలపై పురట్చి తలైవి జయలలిత మోశారు. తిరుగులేని నాయకురాలిగా ఆమె ఎదగడమే కాదు, దేశంలోనే అతి పెద్ద పార్టీ జాబితాలోకి అన్నాడీఎంకేను చేర్చారు. ఆమె మరణం తరువాత పరిణామాలతో పార్టీ మళ్లీ ముక్కలైనెనా ఎట్టకేలకు నేతల మద్దతు, కేడర్ ఆదరణతో అన్నాడీఎంకేను పూర్తిగా పళణిస్వామి తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ బలోపేతం దిశగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ప్రజాచైతన్య యాత్రతో తమిళనాడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో చొచ్చుకెళుతున్నారు.
ఆవిర్భావ సంబరం
శుక్రవారం పార్టీ 54వ వసంతంలోకి అడుగు పెట్టడంతో ఆవిర్భావ వేడుకలను అన్నాడీఎంకే వర్గాలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలతో జరుపుకున్నారు. వాడ వాడలా, పార్టీ కార్యాలయాల్లో అన్నాడీఎంకే జెండాలను ఎగుర వేశారు. బాణాసంచాల్ని హోరెత్తించారు. స్వీట్లు, చాకెట్ల పంపిణీతోపాటుగా సేవా కార్యక్రమాల్లో మునిగారు. ఎంజీఆర్, జయలలిత చిత్ర పటాలు, విగ్రహాలకు నివాళులర్పించడమే కాకుండా, నేతలు తమ ప్రసంగాలతో హోరెత్తించారు. అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌ల నేతృత్వంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆవిర్భావ వేడుక కోలాహలంగా జరిగింది. చైన్నె రాయపేటలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎంజీఆర్ మాళిగైలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి నేతృత్వంలో వేడుకలు జరిగాయి. పెద్ద సంఖ్యలో నాయకులు, కేడర్ తరలివచ్చారు. ఆయనకు బ్రహ్మరథం పట్టేలా ఆహ్వానం పలికారు. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండాను పళణిస్వామి ఎగుర వేశారు. ఎంజీఆర్, జయలలిత విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అన్నాడీఎంకే ఘన చరిత్రను చాటే సావనీర్‌ను విడుదల చేశారు. స్వీట్లు, చాక్లెట్లు పంచి పెట్టారు. అన్నదానం చేశారు. పార్టీలోని కేడర్‌కు సహాయకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్, నేతలు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్, జయకుమార్, ఎస్పీ వేలుమణి, జయకుమార్, పొల్లాచ్చి జయరామన్, వలర్మతి గోకుల ఇందిర, తదితరులు పాల్గొన్నారు.
రేపు మనదే..
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ పేజీలో పళణి స్వామి ట్వీట్ చేశారు. సోదర సోదరీమణులు అని పేర్కొంటూ, అన్నాడీఎంకే వర్గాలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడును, తమిళ ప్రజలను రక్షించేందుకు అడుగుల వేగాన్ని పెంచామని, రేపు మనదే అన్న ధీమాతో మరింతగా దూసుకెళదామన్నారు. అధికారం చేపట్టబోతున్నామన్న ధీమాతో దివంగత నేతలు ఎంజీఆర్, అమ్మ జయలలిత ఆశయ సాధనలో దూసుకెళదామని పిలుపునిచ్చారు.
ఐదు దశాబ్దాల తీపి జ్ఞాపకాల వేడుక
ఐదు దశాబ్దాల తీపి జ్ఞాపకాల వేడుక