
కరూర్ మృతులకు నివాళి
న్యూస్‌రీల్
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తొలి రోజు సంతాపాలతో సరి
సభా ప్రాంగణంలో పీఎంకే పంచాయితీ
ఎమ్మెల్యేలతో పళణి భేటీ
దురై మురుగన్‌కు పరామర్శ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతులకు అసెంబ్లీలో మంగళవారం నివాళులర్పించారు. రెండు నిమిషాల మౌన అంజలితో పాటూ మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని తెలియజేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజైన సంతాప తీర్మానాలతోనే సరి పెట్టారు. ఇక బుధవారం అసెంబ్లీలో అనుబంధ ఆర్థిక నివేదికను మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేయనున్నారు.
సాక్షి, చైన్నె: 2025 సంవత్సరంలో చివరి అసెంబ్లీ సమావేశం అనుబంధ ఆర్థిక నివేదిక సమర్పణ నిమిత్తం బుధవారం ప్రారంభమైంది. సీఎం స్టాలిన్, సీనియర్ మంత్రి దు రై మురుగన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌తో పాటుగా మంత్రులు, డీఎంకే సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతి పక్ష నేత పళణి స్వామి నేతృత్వంలో ఆ పార్టీ శాసన సభ సభ్యులు సమావేశాలకు హాజరయ్యారు. ఇతర డీఎంకే కూటమి పార్టీలు, ప్రతి పక్ష పార్టీల సభ్యులు సమావేశానికి వచ్చారు. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అప్పావు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు.
కరూర్ మృతులకు..
స్పీకర్ అప్పావు మాట్లాడుతూ, కరూర్ ఘటన గురించి వివరించారు. రాజకీయ ప్రచార సభలో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ అసెంబ్లీ నివాళులర్పిస్తున్నదని ప్రకటిస్తూ, అందర్ని లేచి నిలబడేలా చేసి రెండు నిమిషాలు మౌనం పాటింపజేశారు. అనంతరం ఇటీవల మరణించిన కేరళ సీఎం అచ్యుతానందన్, నాగాలాండ్ మాజీ గవర్నర్ ఇల గణేషన్, అన్నాడీఎంకే వాల్పారై ఎమ్మెల్యే అముల్ కందస్వామి, సీనియర్ ఐఎఎస్ అధికారిణి బీలా వెంకటేష్‌ల మృతికి సభలో సంతాపం తెలియజేశారు. కాగా, తమిళనాడు అసెంబ్లీలో ప్రపథమంగా తాజాగా మృతులకు నివాళులర్పించే సమయంలో వారి చిత్ర పటాలను, వారి వివరాలను ఎల్‌ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. అనంతరం సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం సభలో అనుబంధ ఆర్థిక నివేదికను మంత్రి తంగం తెన్నరసు దాఖలు చేయనున్నారు. అలాగే, పలు తీర్మానాలు సభ ముందుకు రానున్నాయి.
సెంగోట్టయన్ దూరం..
సంతాప తీర్మానాల అనంతరం ప్రతిపక్ష నేత పళణి స్వామి సీనియర్ మంత్రి దురై మురుగన్‌ను కలిసి కాసేపు మాట్లాడడం ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే కొద్ది రోజులుగా అనార్యోగంతో చికిత్సలో ఉన్న దురై మురుగన్‌ను పళణి స్వామి పరామర్శించి, ఆరోగ్య గురించి వాకబు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం పార్టీ శాసన సభా పక్ష ఛాంబర్‌లో ఎమ్మెల్యేలతో పళణి స్వామి సమావేశమయ్యారు. బుధవారం నుంచి సభలో వ్యవహరించాల్సిన అంశాలు, అధికార పక్షాన్ని ఢీకొట్టే అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల సమష్టి గళం నినాదం అందుకుని అన్నాడీఎంకేలో పదవులను కోల్పోయిన సీనియర్ నేత సెంగోట్టయన్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశానికి హాజరైన ఆయన అన్నాడీఎంకే సభ్యుల వరుసలో తనకు కేటాయించి ఉన్న సీట్లో కూర్చున్నారు. సభ వాయిదా పడగానే, బయటకు వెళ్లి పోవడం గమనార్హం.
సభకు పీఎంకే వార్
పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం అసెంబ్లీ ఆవరణకు చేరింది. సభకు రాందాసు మద్దతు ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ శాసన సభా పక్ష నేత, విప్‌లు జీకేమణి, అరుల్ వచ్చారు. అలాగే, అన్బుమణి మద్దతు ముగ్గురు ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. అన్బుమణి మద్దతు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో కూర్చుని ధర్నాకు దిగారు. పీఎంకే శాసన సభా పక్ష నేత పదవి నుంచి జీకే మణిని, విప్ పదవి నుంచి అరుల్‌ను తప్పించాలని నినదించారు. పార్టీ శాసన సభా పక్ష నేతగా వెంకటేషన్‌ను అంగీకరించాలని డిమాండ్ చేశారు. చివరకు స్పీకర్ అప్పావును తమ శిబిరానికి చెందిన న్యాయవాది బాలుతో పాటూ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కలిశారు. వినతి పత్రం సమర్పించారు. కాగా, అసెంబ్లీ ఆవరణలో చోటు చేసుకున్న పరిణామంపై పార్టీ గౌరవ అధ్యక్షుడు, శాసన సభా పక్ష నేత జీకే మణి స్పందిస్తూ, రాందాసుకు వచ్చిన శోదన..., తమకు వచ్చిన వేదన అని ఉద్వేగ భరితంగా వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే పీఎంకే ఎమ్మెల్యేలు , తాజాగా రెండుగా విడిపోయి పోరాటాలు చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.
సీఎంతో తిరుమా భేటీ
అసెంబ్లీ సమావేశం వాయిదా పడ్డ అనంతరం ఛాంబర్‌కు వచ్చిన సీఎం స్టాలిన్‌తో తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కులాల పేరిట ఉన్న గ్రామాలు, వీధులు, రోడ్ల పేర్ల తొలగింపునకు ఉత్తర్వులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడ కులం అన్నది గ్రామాల పేర్లలో కనిపించ కుండా కట్టుదిట్టంగా చర్యలు వేగవంతం చేయాలని తిరుమా విజ్ఞప్తి చేశారు.

కరూర్ మృతులకు నివాళి

కరూర్ మృతులకు నివాళి

కరూర్ మృతులకు నివాళి