
ఎల్‌పీజీ సమ్మె విరమణ
సాక్షి, చైన్నె: హైకోర్టు సూచనతో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ల సమ్మెను యాజమాన్యాలు, కార్మికులు విరమించారు. కాగా చమురు సంస్థలు ట్యాంకర్ల ఒప్పందాన్ని 2026 మార్చి వరకు పొడిగిస్తూ హైకోర్టుకు నివేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చమురు సంస్థలు ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్లకు కొత్త నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ టెండర్లను ఆహ్వానించడం వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం ఒప్పందంతో నడుస్తున్న ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ల యాజమానులు, డ్రైవర్లు, ఇతర కార్మికులలో ఆగ్రహం వ్యక్తమైంది. చమురు సంస్థల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె గంట మోగించారు. ఏడో రోజుగా మంగళవారం సాయంత్రం వరకు సమ్మె సాగింది. కాగా టెండర్లకు స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు చమురు సంస్థ వివరణ ఇచ్చింది. ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఉన్న ఒప్పందాలను 2026 మార్చి వరకు పొడిగిస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది వరకు ఉనన నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఆ మేరకు ఈ ఒప్పందాలు సైతం కొనసాగుతాయని, ఇది మార్చి వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త నిబంధనలు అమలు తాజాగా అమలు చేయబోమని ప్రకటించారు. దీంతో హైకోర్టు స్పందించింది. ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ల యజమానుల, కార్మికులకు సూచన చేసింది. ఒప్పందాలు కొనసాగనున్న దృష్ట్యా, సమ్మె వీడాలని సూచించారు. మళ్లీ సమ్మె గంట మోగించ కూడదన్న హెచ్చరికలు చేసింది. దీంతో సమ్మె విరమిస్తున్నామని ప్రకటించి గ్యాస్ ట్యాంకర్లను యథావిధిగా కదలించారు.