
ప్రగతి పథకాల అధ్యయనం
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రణాళికా సంఘం నాలుగు నివేదికలు సిద్ధం చేసింది. వీటిని మంగళవారం సీఎం ఎంకే స్టాలిన్‌కు అందజేశారు. ఉదయం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఇందులో మహిళా హక్కు పథకం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్, నాన్ మొదల్వన్ మూల్యాంకనం, తమిళనాడులో స్టార్టప్‌లకు పర్యావరణ వ్యవస్థ – అవకాశాలు, సవాళ్లు, తమిళనాడు గ్రామీణ, పట్టణ హౌసింగ్ పాలసీ – ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ల గురించి నివేదికలను సిద్ధంచేసి అందజేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ జె. జయరంజన్, ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం ప్రణాళిక, అభివృద్ధి విభాగం కార్యదర్శి సజ్జన్ సింగ్ రావు చవాన్, రాష్ట్ర ప్రణాళిక కమిటీ సభ్య కార్యదర్శి ఎస్. సుధ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘానికి ముఖ్యమంత్రి స్టాలిన్ చైర్మన్‌గా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇది తమిళనాడుకు చెందిన ఉన్నత స్థాయి సలహా కమిటీగా ఉంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ప్రభుత్వ పాలనలో మూల్యాంకన, అధ్యయనాలు మరియు కొత్త పరిణామాలను, అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వివిధ అధ్యయనాలు నిర్వహిస్తూ, నివేదికల ద్వారా రాష్ట్ర ప్రగతికి ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తున్నది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం మహిళా హక్కుల ప్రాజెక్టు ప్రభావం, అంచనా అధ్యయనం నిర్వహించింది. ఈ పథకం మేరకు లబ్ధిదారులకు ఉపయోగకరంగా ఉందో నివేదికలో పేర్కొంది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో, లబ్ధిదారులు ఎక్కువగా ఈ మొత్తాన్ని వైద్య ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నట్టు, పిల్లల విద్య కోసం ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఈ పథకం మహిళల అభివృద్ధికి ఒక కారకంగా మారిందని స్పష్టం చేశారు. నాన్ మొదల్వన్ పథకం ఇంజినీరింగ్ , పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దోహదకరంగా, ఉపాధికి మార్గంగా , పోటీ పరీక్షలలో ఆత్మ విశ్వాసం నింపే రీతిలో ఉన్నట్టు అధ్యయనంలో వివరించారు. అలాగే, రాష్ట్ర అభివృద్దికి, ఆవిష్కరణల కోసం వ్యూహాలను రూపొందించడం చాలా ముఖ్యంగా మరో నివేదికలో స్పష్టం చేశారు.