
అజ్ఞాత వాసం వీడిన టీవీకే నేతలు
సాక్షి, చైన్నె: కరూర్ విషాద ఘటన కేసును సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు అప్పగించడంతో అజ్ఞాతంలో ఉన్న టీవీకే నేతలు జనవాసంలోకి వచ్చేశారు. తమ అధ్యక్షుడు విజయ్‌తో భేటీ అయ్యారు. కరూర్ బాధితుల పరామర్శ పర్యటన కసరత్తులలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు 10 మందితో కూడిన కమిటీ రంగంలోకి దిగనుంది. వివరాలు.. విజయ్ ప్రచారం సందర్భంగా కరూర్‌లో చోటు చేసుకున్న ఘోర ఘటనలో 41 మంది మరణించడం, 160 మంది ఆస్పత్రి పాలు కావడంతో అక్కడి పోలీసులు దూకుడు పెంచారు. తమిళగ వెట్రికళగం(టీవీకే) వర్గాలపై కేసులు, అరెస్టుల పర్వంపై దృష్టి పెట్టారు. దీంతో ఈ కేసులలో కీలకంగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్‌తో పాటూ పలువురు అజ్ఞాతంలోకి వెళ్లారు. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. రెండు వారాలకు పైగా టీవీకే ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. విజయ్ తన మకాంను నీలాకరై నుంచి పట్టినంబాక్కం నివాసంకు మార్చేశారు. రెండు వారాలుగా విజయ్ పార్టీ తరపున కార్యక్రమాలు స్థంబించినట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో కరూర్ కేసును సీబీఐకు అప్పగించడమే కాకుండా, ఈ దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తిని సుప్రీం కోర్టు నియమించడం టీవీకే వర్గాలకు పెద్ద ఉపశమనంగా మారింది.
అజ్ఞాత వాసం వీడి..
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో టీవీకే వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. అజ్ఞాత వాసంను వీడి ప్రజలలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మళ్లీ పార్టీ కార్యక్రమాల వేగాన్ని పెంచే దిశగా వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. ముందుగా కరూర్‌లో బాధితులను కలిసి పరామర్శించేందుకు విజయ్‌తో కలిసి అడుగులు వేయడానికి నేతలు కసరత్తులలో మునిగారు. మంగళవారం విజయ్‌తో భుస్సీ ఆనంద్, నిర్మల్‌కుమార్, ఆదవ్ అర్జునతో పాటూ టీవీకే ఉన్నత స్థాయి కమిటీలోని ముఖ్యులు భేటీ కావడం గమనార్హం. కరూర్ బాధితుల పరామర్శ, మళీ విజయ్ పర్యటనకు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. కాగా, విజయ్ పర్యటన రెండు వారాలు మాత్రమే వాయిదా వేశారన్న విషయం తెలిసిందే. గురులేదాశుక్రవారం కరూర్‌లో బాధితులను పరామర్శించినానంతరం మరో వారం తర్వాత పర్యటన మొదలెట్టే దిశగా రూట్ మ్యాప్ రూపకల్పనకు నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. కరూర్‌లో బాధితుల పరామర్శ ఏర్పాట్ల పర్యవేక్షణకు భుస్సీ ఆనంద్ నేతృత్వంలో పది మందితో కమిటీని నియమించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే సభలలో టీవీకే జెండాల గురించి నిర్మల్‌కుమార్‌ను ప్రశ్నించగా, అన్నింటికి త్వరలో మంచి సమాధానాల వస్తాయని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా కేసును సీబీఐకు అప్పగించిన నేపథ్యంలో విచారణ అధికారిగా ఎవరిని నియమిస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే పర్యవేక్షణ కమిటీ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐపీఎస్‌లు ఎవరు ఉంటారో అన్న చర్చ ఊపందుకుంది.