
టాస్మాక్ అక్రమాల కేసులో వాడీవేడి వాదనలు
సాక్షి, చైన్నె : టాస్మాక్ అక్రమాల కేసు వ్యవహారం సుప్రీం కోర్టులో మంగళవారం వాడీవేడి వాదనలతో సాగింది. ఎన్ ఫోర్సు డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషన్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ అక్షింతలు వేసింది. వివరాలు.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నేతృత్వంలోని టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా రూ. 1000 కోట్లు అక్రమాలు అంటూ ఈడీ వర్గాలు గత కొంత కాలంగా చేస్తూ వస్తున్న హడావుడి గురించి తెలిసిందే. ఈ వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో ఈడీ అధికారులకు హైకోర్టు పలుమార్లు హెచ్చరికలు చేసింది. అక్షింతలు వేసింది. అదే సమయంలో ఈ కేసులో టాస్మాక్ అధికారులను విచారణ పేరిట ఈడీ వేధిస్తున్నట్టుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది.
హోరాహోరీగా..
రాష్ట్ర ప్రభుత్వం తరపున బలమైన వాదనలు సీనియర్ న్యాయవాదులు ఉంచారు. అధికారులను, మహిళలను విచారణ పేరిట వేధించారని, ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడి ఫైళ్లు, రికార్డులు ఎత్తుకెళ్లారని వివరించారు. ఈ టాస్మాక్ వ్యవహారంలో 38 కేసులు ఉన్నాయని, వీటిన్నింటిని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ విచారిస్తున్నట్టు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసమయంలో ఈడీ వర్గాలకు అక్షింతలు వేస్తూ తీవ్రంగానే బెంచ్ స్పందించింది. అనుమానం వస్తే...చొరబడి ఫైళ్లు ఎత్తుకెళ్తారా.? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి లోబడి కేసు విచారణ జరుగుతున్నప్పుడు, ఇందుకు మీ జోక్యం ఎందుకు? అని అసహనం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా సోదాలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా, కేవలం అనుమానంతో సోదాలుచేసేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో తమకు వచ్చిన సమాచారంతో సోదాలు చేశామని, టాస్మాక్ దుకాణాలలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు విక్రయాలు జరుగుతున్నాయని ఈడీ తరపున వాదనలు కోర్టుముందు ఉంచారు. ఈ కేసును ఇప్పటికే ఏసీబీ విచారిస్తున్న విషయాన్ని మరలా గుర్తు చేస్తూ, వారి విచారణలో ఏదేని లోపం ఉందా? అన్న ప్రశ్నను సంధిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని సంస్థ వ్యవహారంలో మీ జోక్యం ఏమిటో అన్న అసహనం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.