ఆమ్నీ బస్సులపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఆమ్నీ బస్సులపై కొరడా

Oct 15 2025 5:54 AM | Updated on Oct 15 2025 5:54 AM

ఆమ్నీ బస్సులపై  కొరడా

ఆమ్నీ బస్సులపై కొరడా

● ఆర్టీఏ అధికారులతో నిఘా బృందాలు ●13 మందికి అస్వస్థత ●ఇద్దరి పరిస్థితి విషమం

● ఆర్టీఏ అధికారులతో నిఘా బృందాలు

సాక్షి, చైన్నె: చార్జీలను అమాంతం పెంచేసి దోపిడీకి సిద్ధమైన ఆమ్నీ ప్రైవేటు బస్సుల నడ్డి విరిచేందుకు రవాణా కమిషనరేట్‌ సిద్ధమైంది. ఆర్టీఏ అధికారులు, ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పండుగ సీజన్‌ వస్తున్నదంటే చాలుఆమ్నీ ప్రైవేటు బస్సులు చార్జీల దోపిడీకి దిగడం పరిపాటిగా మారింది. తాజాగా దీపావళి సందర్భంగా చార్జీల దోపిడీకి సిద్ధమయ్యాయి. ఆయా ట్రావెల్స్‌ వెబ్‌సైట్‌లలో ఇది వరకు ఉన్న చార్జీలకు రెట్టింపుగా వివిధ ప్రాంతాలకు వసూలు చేస్తూ వివరాలను పొందు పరచడం చర్చకు దారి తీసింది. ఈ చార్జీల దోపిడీకి కల్లెం వేయాలని ప్రజలు ప్రభుత్వానికి విన్నవించుకునే పనిలో పడ్డారు. చార్జీల దోపిడీ మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పదని రవాణా మంత్రి శివశంకర్‌ ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితులలో ఆమ్నీ ప్రైవేటు బస్సులను ఆపి తనిఖీలు చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చైన్నె, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి, తిరునల్వేలి తదితర 12 ప్రాంతాలలో జాతీయ, రాష్ట్రరహదారులలో ఆర్టీఏ అధికారులు, ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో బృందాలు నిఘా వేయనున్నాయి. ఆమ్నీ బస్సులలో ప్రయాణించే ప్రయాణీకుల వద్ద చార్జీల వివరాలను సేకరించనున్నాయి. ఏ ట్రావెల్స్‌ యాజమాన్యమైనా అధిక చార్జీలు వసూళ్లు చేసినట్టు తేలిన పక్షంలో జరిమాన విధించడం ఆ తర్వాత బస్సులను సీజ్‌ చేయడం దిశగా ఈ బృందాలు ముందుకెళ్లనున్నాయి.

ఆపరేషన్‌ థియేటర్లో కలకలం

సాక్షి, చైన్నె: పెరంబలూరు జిల్లాకేంద్రం ఆస్పత్రి ఆపరేషన్‌ థియేటర్‌లో మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఇందులోకి వెళ్లిన కార్మికులు ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు లోనయ్యారు. 13 మంది అత్యవసర విభాగంలో చికిత్సలో ఉండగా, ఇద్దరికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. పెరంబలూరు జిల్లా కేంద్రం ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్లలో శుభ్రం చేసేందుకు ఉదయాన్నే పారిశుద్ధ్య కార్మికులు వెళ్లారు. వెళ్లిన వారు ఎంతకు రాక పోవడంతో ఒకరి తర్వాత మరొకరు లోనికి వెళ్లి అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేగింది. దీంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు లోనైన వారిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో వారికి మరింత మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే ఆపరేషన్‌ థియేటర్లలో ఏదేని విషవాయువు సోకిందా? లేదా..? మరేదైనా కారణాలు ఉన్నాయా? అని ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

ఎంజీఎంలో రాపిడ్‌ స్ట్రోక్‌ రెస్పాన్స్‌ టీం

సాక్షి, చైన్నె: ఎంజీఎం మలర్‌లో స్ట్రోక్‌ కేర్‌, పెషేంట్‌ సపోర్టును ముందుకు తీసుకెళ్లేందుకు రాపిడ్‌ స్ట్రోక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను ఏర్పాటుచేశారు. సురక్షితమైన కార్డియాక్‌, న్యూరో వాస్కులర్‌ జోక్యాల కోసం అధునాతన ఇమేజింగ్‌, రియల్‌ –టైమ్‌ డోస్‌ మానిటరింగ్‌, అత్యాధునిక సాంకేతికతలను కలిగిన కొత్త క్యాత్‌ లాబ్‌ను కూడా ప్రారంభించారు. స్ట్రోక్‌ లక్షణాలు కనిపించే మొదటి గంటలోపు సత్వర్య చర్యలు తీసుకోవడం, గోల్డెన్‌ అవర్‌ ప్రాణాలను కాపడటానికి, మెదడు దెబ్బ తిన కుండా రక్షించేందుకు ఈ టీమ్‌లోని నిపుణులు సేవలు అందించనున్నారు. అక్టోబరు 29వ తేదీ జరుపుకోనున్న స్ట్రోక్‌ దినోత్సవంలో భాగంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ బృందానికి గాను అంబులెన్స్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. సినీ హాస్య నటుడు సెంథిల్‌, అనబండ్‌ సంస్థ డైరెక్టర్‌ జనకీరామన్‌ విజయకుమార్‌ సెంబియన్‌, కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌ వినయ్‌,జీ తమిళ్‌ వ్యాఖ్యాత అవుడయప్పన్‌, ఎంజీఎం వైద్యులు కార్తికేయన్‌, సాయి ప్రశాంత్‌, అరవింద్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తికేయన్‌ మాట్లాడుతూ ఏటా చైన్నెలో 15 వేల మంది స్ట్రోక్‌ బారిన పడుతున్నారని గుర్తుచేస్తూ, పెరుగుతున్న కేసుల నమోదు దృష్ట్యా, వైద్య సేవలను మెరుగు పరిచే విధంగా, సకాలంలో సేవలు అందించేందుకు ఈ టీమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. సాయి ప్రశాంత్‌ మాట్లాడుతూ, ప్రతి రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను నిర్ధారించడానికి, సమగ్ర సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement