
ఆరోగ్య సంరక్షణకు ఒప్పందం
సాక్షి, చైన్నె : ఆరోగ్య సంరక్షణ చర్యలను విస్తృతం చేయడం లక్ష్యంగా సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చైన్నె అపోలో ఆస్పత్రి మధ్య అవగాహన ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ ఒప్పందాలపై సీమాట్స్ చాన్స్‌లర్ డాక్టర్ వీరయ్యన్, ప్రో ఛాన్సలర్ డాక్టర్ దీపక్ నల్ల స్వామి, అపోలో సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియ మూర్తి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మురుగన్, లివర్ డిసీజ్ విభాగం హెడ్ డాక్టర్ కె ఇలన్ కుమరన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందం గురించి వారు వివరిస్తూ, ప్రపంచ స్థాయి కాలేయ మార్పిడి నైపుణ్యాన్ని సగం ఖర్చుతో రోగులకు అందించనున్నట్టు ప్రకటించారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకే పరిమితమైన ప్రాణ రక్షణ శస్త్రచికిత్సలు తాజాగా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. అధునాతన కాలేయ సంరక్షణ విధానాలు, మార్పిడిని విస్తరించడానికి కృషిచేస్తామన్నారు. ఆరోగ్య సంరక్షణ ఒక హక్కు అని, ఆర్థికనష్టం లేకుండా అందరికి అందజేస్తామని వ్యాఖ్యలు చేశారు.