
ప్రేమ ఇతివృత్తంతో రాజావీట్టు కన్నుకుట్టి
చిత్ర ఆడియోను ఆవిష్కరించిన యూనిట్ సభ్యులు
తమిళసినిమా: సందర్భం, పరిస్థితులు మనుషుల ఏమేమి చేయిస్తాయి అన్నదానికి ఉదాహరణ రాజావీట్టు కన్నుకుట్టి. ఒక యువతిని గాఢంగా ప్రేమించిన యువకుడు పరిస్థితుల ప్రభావం కారణంగా సింగపూర్‌కు వెళతాడు. కొద్ది కాలం తర్వాత అతను సొంత ఊరికి చేరుకొని, వెంటనే తన ప్రేయసిని వెతుక్కుంటూ వెళతాడు. అయితే ఆమెకు పెళ్లి అయిన విషయం తెలుసుకొని షాక్‌కు గురవుతాడు. ఆ పరిస్థితుల నుంచి బయటపడడానికి అతని స్నేహితుడు తన చెల్లితో పెళ్లి జరిపిస్తాడు. దీంతో పాత జ్ఞాపకాలను మర్చిపోయి సంతోషంగా జీవిస్తున్న అతనికి భార్య గర్భం ధరించడంతో చెప్పలేని ఆనందానికి గురవుతాడు. అలాంటి పరిస్థితుల్లో తన గతానికి చెందిన ఒక సంఘటన వెలుగు చూస్తుంది. అది అతనిని కాకుండా అతని భార్యను కూడా బాధిస్తుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఆ సంఘటన ఏమిటి ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం రాజావీట్టు కన్నుకుట్టి. ఆర్‌ఆర్ మూవీస్ పతాకంపై డాక్టర్ రాజా నిర్మించారు. యాకూబ్‌ఖాన్ నిర్మాతగా బాధ్యతలను నిర్వహించారు. ఏపీ రాజీవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అధిక్ చిలంబరసన్, గాయత్రి రమ, అనుకష్ణ హీరో హీరోయిన్గా నటించిన ఇందులో తంబిశివన్, వర్షిత, విజయ్ టీవీ శరత్ ముఖ్యపాత్రలు పోషించారు. టైసన్ రాజా సంగీతాన్ని, హరికాంత్ చాయాగ్రహణం అందించిన చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు. నటుడు,నిర్మాత కే రాజన్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, జాగ్వర్ రంగం,ఎన్ విజయ మురళి, వివేక్ భారతి పాల్గొని ఈ చిత్ర ఆడియోను ఆవిష్కరించి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు.

ప్రేమ ఇతివృత్తంతో రాజావీట్టు కన్నుకుట్టి