
ఉన్నత విద్య ద్వారానే దేశాభివృద్ధి
వేలూరు: ఉన్నత విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఇందుకోసమే వీఐటీలో ఉన్నత విద్యా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాధన్ అన్నారు. వేలూరు వీఐటీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నార్త్ ఆర్కాడు జిల్లా విద్యాభివృద్దిని సాధించడానికే వీఐటీ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా పథకాన్ని మొదటి సారిగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం రూ. 2 కోట్లుకు పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయడం జరిగిందన్నారు. వీటితో పాటూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి జిల్లాలో మొదటి ర్యాంకులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు వీఐటీలో ఉచిత విద్యను అభ్యసించేందుకు స్టార్స్ పథకాన్ని ప్రాంభించడం జరిగిందన్నారు. ఈ పథకం కింద విద్యను అభ్యసించిన విద్యార్థులకు వీఐటీ ఆధ్వర్యంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసించి నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. విద్య అభివృద్ది చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి వ్యక్తిగత ఆదాయంలో పెరుగుదలతో కూడి ఉంటుందన్నారు. విద్యా వంతుల పరంగా కేరళ మొదటి స్థానంలో ఉందని, ఉన్నత విద్య ఉన్న వ్యక్తుల సంఖ్యలో తీసుకుంటే తమిళనాడు మొదటి స్థానంలో ఉందన్నారు. వీఐటీ యూనివర్సిటీలో పరిశోధన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇప్పటికే వేలూరు, చైన్నె, అమరావతి, భోపాల్ వంటి క్యాంపస్‌లో పలువురు విద్యార్థులు, ఫ్రొఫెసర్‌లు పలు పరిశోధనలు చేయడంతో పాటూ పీహెచ్‌డీ విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామన్నారు. దీంతోనే పలు పరిశోధనలు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలోల వేలూరు వీఐటీకి ఇండియాలోనే ద్వితీయ స్థానం లభించిందన్నారు. ఇటీవల కొత్త కొత్త పరిశోధనలపై ఆశక్తి చూపుతున్నామని త్వరలోనే ఆ కరపత్రాలను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీఐటీ ఉపాద్యక్షులు శేఖర్, కార్యనిర్వహణ డైరెక్టర్ సంద్యా పెంటారెడ్డి, రమణి, వైస్ చాన్సలర్ కాంచన, ప్రొచాన్సలర్ పార్థశారది మల్లిక్, రిజిస్టార్ భారతి తదితరులు పాల్గొన్నారు.