
మమితా నటిస్తున్నారంటేనే ఆశ్చర్యపోయా!
తమిళసినిమా: లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో కథానాయకుడిగా అనూహ్య విజయాలను సాధించిన నటుడు ప్రదీప్ రంగనాథన్. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం డ్యూడ్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ద్వారా కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మమిత బైజు నాయకిగా నటించిన ఇందులో శరత్‌కుమార్, నేహ ముఖ్యపాత్రలు పోషించారు. సాయి అభయంకర్ సంగీతాన్ని, నికేత్ బొమ్మి చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ దీపావళి సందర్భంగా ఈనెల 17న తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పొందడం విశేషం. సోమవారం చైన్నెలోని ఒక ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన చిత్ర మీడియా సమావేశంలో మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ ఒక మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడు కీర్తిశ్వరన్‌కు కతజ్ఞతలు అన్నారు. తమిళంలో డ్యూడ్ తమకు రెండవ చిత్రమని చెప్పారు. చిత్రంలో ప్రేమ, ఎమోషనల్, యాక్షన్ ,సెంటిమెంట్ వంటి అంశాలు ఉంటాయన్నారు. ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించిన శరత్‌కుమార్ తనకు ఇన్సిప్రేషన్ అన్నారు. తాను లవ్ టుడే చిత్రం చేసే ముందు హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మమితా బైజును ఒక షార్ట్ ఫిలింలో చూశానన్నారు. తన చిత్రంలో ఆమెను నటింపచేయడానికి ప్రయత్నించినప్పుడు, తను వణంగాన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండడంతో కుదరలేదు అన్నారు. అలాంటిది డ్యూడ్‌లో మమితా నటిస్తున్నారని దర్శకుడు చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఫీల్ అయ్యానన్నారు. ఇంతవరకు చూడని మమితా బైజును ఇందులో చూస్తారని ప్రదీప్ రంగనాథన్ తెలిపారు.