
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో గ్రీన్ వేలూరు ఆధ్వర్యంలో ఐదు లక్షల విత్తన బాల్స్ చల్లే కార్యక్రమాన్ని వేలూరు సమీపంలోని తీర్థగిరి కొండపై మంగళవారం ఉదయం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ తిరువణ్ణామలై జిల్లా జవ్యాది కొండలోని పురాతన చెట్ల విత్తనాలను తీసి వాటిని మట్టిలో బాల్స్‌గా తయారు చేసి వాటిని అటవీ ప్రాంతంలో చల్లడం వల్ల రానున్న రోజుల్లో కొండ ప్రాంతాల్లో మొక్కలు పెరిగి పెద్దవిగా మారి ఆరోగ్యకరమైన గాలి వీచే అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల టీచర్లు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పాఠశాలలోని ప్రతి టీచర్ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అటవీశాఖలో ఒక చెట్టు కూలితే పది మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోవాలన్నారు. యూనియన్ చైర్మన్ అముద, వైస్ చైర్మన్ మహేశ్వరి, ప్రజాసేవకుడు దినేష్ శరవణన్, బీడీఓ తిరుమాల్, తహసీల్దార్ వడివేల్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.