
అభివృద్ధి పనులకు భూమిపూజ
పళ్ళిపట్టు: ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.45 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చంద్రన్ శుక్రవారం భూమి పూజ చేసి, ప్రారంభించారు. యూనియన్‌లోని కీచ్చళంలో రూ.15.50 లక్షల వ్యయంతో అంగన్‌వాడీ కేంద్ర నూతన భవనం, బొమ్మరాజుపేటలో రూ.14 లక్షల వ్యయంతో కళావేదిక, రూ. 15 లక్షల వ్యయంతో పొదటూరుపేట ప్రభుత్వ బస్సు డిపోకు ప్రహరీగోడ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని ప్రభుత్వ పథకాలకు సంబంధించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రన్ మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంకే మండల కార్యదర్శి రవీంద్ర, డీఎంకే నాయకులు పాల్గొన్నారు.