
నేడు గ్రామసభ
సాక్షి, చైన్నె : రాష్ట్రవ్యాప్తంగా శనివారం అన్ని గ్రామాల్లో గ్రామ సభలు జరగనన్నాయి. ఇందులో సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా ప్రసంగించబోతున్నారు. ఇందు కోసం అన్ని పంచాయతీల ఆవరణల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడి సచివాలయంలో ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమిళనాడులో గ్రామసభ సమావేశాలు ఆరుసార్లు జరుగుతాయన్నారు. కొన్ని సార్లు అదనంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. జనవరి 26, మార్చి 22, మే 1, ఆగస్టు 15, అక్టోబర్ 2, నవంబర్ 1 తేదీలో గ్రామ సభల సమావేశాలు జరుగుతాయని గుర్తుచేస్తూ, ఈ సారి అక్టోబర్ 2న విజయ దశమి పర్వదినం కావడంతో సమావేశాలను వాయిదా వేశామన్నారు. ఈ సమావేశాన్ని శనివారం నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సారి గ్రామ సభలను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ప్రసంగిస్తారని తెలిపారు. 10 వేల గ్రామ పంచాయతీల్లో సీఎం ప్రసంగాన్ని జనం వీక్షించేందుకు, వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని పంచాయతీల్లో ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా నెట్ సేవలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేస్తూ, గ్రామసభ సమావేశంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్‌న్స్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఈ సారి గ్రామసభ సమావేశంలో ప్రధానంగా ఓ అంశాన్ని తెర మీదకు తీసుకు రానున్నామన్నారు. ఆ మేరకు గ్రామాలలోని ఊర్ల పేర్లు, వీధుల పేర్లకు ఉన్న కులాల పేర్ల తొలగింపునకు సంబంధించిన ప్రత్యేకంగా అభిప్రాయాలను సేకరించనున్నామన్నారు. అలాగే, ఇతర సమస్యలు, అంశాలపై చర్చించి గ్రామ సభలో తీర్మానం ఆమోదించి అమలు చేయనున్నామని తెలిపారు.