
జీఎస్టీ తగ్గింపు ఎంతో లాభదాయకం
అజయ్ శ్రీవాత్సవ వ్యాఖ్య
కొరుక్కుపేట: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో ఎంతో లాభదాయకమని ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజల ఖర్చులు తగ్గాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు– న్యూఢిల్లీ అజయ్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బహుళ ధ్రువ ప్రపంచంలో ప్రపంచ వాణిజ్యం భవిష్యత్తు (వాణిజ్య సుంకాలు– ఉద్రిక్తతలు) అనే అంశంపై 14వ జేవీ సోమయాజులు స్మారక ఉపన్యాసం చైన్నె టీనగర్‌లో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా అజయ్ శ్రీవాత్సవ హాజరై జీఎస్టీ తగ్గింపుతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు కలిగే లాభాలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, మరోవైపు అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఉత్పత్తులపై విధిస్తున్న పన్నులు, ఆయన స్వార్థపూరిత నిర్ణయాలతో భారత్‌కి ఎలాంటి నష్టం లేదని అన్నారు. కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు అజయ్ శ్రీవాత్సవ సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ముందుగా ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు డాక్టర్ వీఎల్ ఇందిరాదత్ తన ఆహ్వాన సందేశాన్ని నిర్వాహకులు చదివి వినిపించారు. ఇందులో ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహన్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కెఎన్ సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు డాక్టర్ జె. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.