
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎంపీ హరి అన్నారు. అన్నాడీఎంకే బూత్ ఏజెంట్ల సమావేశంలో మాజీ ఎంపీ హరి పాల్గొని, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలుపై పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. తిరుత్తణి యూనియన్ అన్నాడీఎంకే కార్యదర్శి ఈఎన్.కండ్రిగ రవి అధ్యక్షతన ఆ పార్టీ గ్రామ కార్యదర్శులతోపాటు బూత్ కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, మాజీ మంత్రి బీవీ.రమణ, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ ఎంపీ హరి పాల్గొన్నారు. సమావేశంలో హరి మాట్లాడుతూ ఎడపాడి పళనిస్వామి ఆధ్వర్యంలో అన్నాడీఎంకే పాలన తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కీలకం కావాలన్నారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అన్నాడీఎంకే పాలనలో అమలు చేసిన పథకాలు నిర్వీర్యం చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బూత్ లెవల్ కార్యకర్తలు ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన పెంచుకుని, దొంగ ఓట్లు అరికట్టడం, ప్రలోభాలకు గురికాకుండా డీఎంకే క్యాడర్‌ను ఎదుర్కొనాలని సూచించారు.