
ఎవరితోనైనా కూటమికి రెడీ!
– పళణిస్వామి
సాక్షి, చైన్నె: తాము ఎవరితోనైనా కూటమి పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పష్టం చేశారు. తమిళ ప్రజలను, తమిళనాడును రక్షిద్దామన్న నినాదంతో ప్రజాచైతన్య యాత్రను నామక్కల్, ఈరోడ్ జిల్లాలో పళణిస్వామి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఇప్పటివరకు 123 నియోజకవర్గాలలో తాను పర్యటించానని వివరించారు. వెళ్లిన చోటంతా ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. తనకు వస్తున్న ప్రజాదరణను చూసి డీఎంకే పాలకుల్లో వణుకు బయలు దేరిందన్నారు. 1999, 2001లో బీజేపీతో చేట్టా పట్టలు వేసుకుని, అధికారంలో వాటాను డీఎంకే అనుభవించిందని గుర్తుచేశారు. అప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అనేది డీఎంకేకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడేమో పాసిస్టులు, పాసిజం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సిద్ధాంతాలు వేరు, ఎన్నికల కూటమి వేరు అని పేర్కొన్నారు. ఎన్నికలలో డీఎంకేను గద్దె దించడం లక్ష్యంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తమ కూటమి బలంగా ఉండడంతో డీఎంకేలో భయం పెరిగిందని, అందుకే తమపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. 2026లో గెలుపు తథ్యం అని, అధికారంలోకి రాగానే, డీఎంకే అరాచకాలపై విచారణ జరిపిస్తామని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.