
మానసిక ఆరోగ్యం కోసం మానవహారం
– రికార్డు సృష్టించిన మానవహారం
తిరువొత్తియూరు: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌హిల్స్ ఆర్‌బీ కోఠి జైన్ మహిళా కళాశాల, మానసిక ఆరోగ్యం, శాంతి కోసం ప్రపంచంలోనే అతి పొడవైన మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది గ్రాండ్ యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచ రికార్డు గుర్తింపు పొంది భారతదేశానికి గర్వం తెచ్చిపెట్టింది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు, ప్రశాంత్ హాస్పిటల్స్, నేషనల్ ఇనన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్, లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ పాడియనల్లూర్, సోషల్ స్టార్స్, రెడ్‌హిల్స్ కింగ్, కావంగరై స్టార్, తమిళసింగంతో కలిసి ఆర్‌బీ కోఠి జైన్ మహిళా కళాశాల రెడ్‌హిల్స్ కూట్ రోడ్ నుంచి కామరాజర్ విగ్రహం వరకు మానవ హారం నిర్వహించారు. చైన్నెలోని రెడ్‌హిల్స్ ప్రాంతంలో జరిగిన మానవహారంలో 2వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యావేత్తలు, ఆరోగ్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు చేతులు కలిపి విశ్వాసం, దయ, సామూహిక శక్తిని ప్రదర్శించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మహాలక్ష్మి, నేషనల్ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రీసెర్చ్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, 3241 జిల్లా గవర్నర్ బి.మణిశేఖర్, ప్రశాంత్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జి.ప్రశాంత్ కృష్ణ మానవహారం కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. సెంగుండ్రం పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ రాజారాబర్ట్, డాక్టర్ వెంకటేష్ మదన్‌కుమార్, పంచాయతీ ప్రెసిడెంట్ తమిళ్ అరసి కుమార్, సీఐ ఎళీలన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.ఎం.డి. గోపాల్ హాజరయ్యారు. లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు షణ్ముగసుందరం, చైన్నె సోషల్ స్టార్స్ లయన్స్ క్లబ్ నిర్వాహకుడు ఎం. మహ్మద్ అబూబక్కర్ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.