
క్లుప్తంగా
ఐదుగురు పోలీసులు సస్పెన్షన్
తిరువొత్తియూరు: లారీడ్రైవర్, వ్యాపారి నుంచి లంచం తీసుకున్న వీడియో వైరల్ కావడంతో, ఎస్‌ఐ సహా ఐదుగురు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేస్తూ తాంబరం పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. చైన్నె తాంబరం సమీపంలోని సేలయూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోషపురం చెక్‌పోస్ట్ వద్ద సెప్టెంబర్ 20న ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేశన్, కానిస్టేబుల్స్ విజయ్ పాండి, కదిరేశన్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈసమయంలో అధిక లోడ్‌తో వస్తున్న లారీని ఆపారు. జరిమానా వేయకుండా ఉండడానికి రూ.500 ఇవ్వాలని లారీ డ్రైవర్‌ను లంచం అడిగారు. అదేవిధంగా, సెప్టెంబర్ 23న మేడవాకం మార్కెట్ వద్ద పోలీసులు తిరుమురుగన్, వెంకటేశన్ ఇద్దరూ రోడ్డు పక్కన వ్యాపారి నుంచి లంచం తీసుకున్నారే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై దర్యాప్తు జరిగింది. తాంబరం నగర పోలీస్ కమిషనర్ అబిన్ దినేష్ మోదక్, నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ ఎస్‌ఐ వెంకటేశన్, కానిస్టేబుల్స్ విజయ్‌పాండి, కతిరేసన్, తిరుమురుగన్, వెంకటేశన్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ
–ఇద్దరు దుర్మరణం
తిరువొత్తియూరు: రాజపాళయం వద్ద ఆదివారం తెల్లవారుజామున మాంసం దుకాణంలోకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. రాజపాళయం కామరాజ్‌నగర్‌లో ఒక మాంసం దుకాణం నడుస్తోంది. ఆదివారం కావడంతో దుకాణం తెల్లవారుజామునే తెరిచారు. ఉదయం 7 గంటల సమయంలో తలవాయిపురం కామరాజ్ నగర్‌కు చెందిన పొన్నయ్య (70), సుందరరాజ్‌పురం ఇందిరానగర్‌కు చెందిన ఆకాష్ (16), మణిమారన్ (26) అనే ముగ్గురు మాంసం కొనడానికి దుకాణంలో నిలబడి ఉన్నారు. ఆసమయంలో రాజపాళయం నుంచి ఇటుక లోడ్‌తో వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి మాంసం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న పొన్నయ్య, ఆకాష్ అక్కడికక్కడే మృతిచెందారు. మణిమారన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మణిమారన్‌న్‌ను రాజపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విరుదునగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలవాయిపురం పోలీసులు సొక్కనాథపురానికి చెందిన లారీ డ్రైవర్ తలైమలై (38)ను అరెస్ట్ చేశారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది.
తిరుత్తణి కొండ ఆలయంలో వానరాల పట్టివేత
తిరుత్తణి: తిరుత్తణి కొండ ఆలయంలో భక్తులకు ముప్పుతిప్పలు పెట్టిన వానరాలను అటవీశాఖ సిబ్బంది బోను ద్వారా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి కొండలో భారీ సంఖ్యలో కోతులు నివశిస్తున్నాయి. స్వామి దర్శనంకు వచ్చే భక్తుల నుంచి ప్రసాదాలు, పూజా సామాగ్రి లాక్కెళ్లడం, కొరకడంతో పరిపాటిగా మారింది. దీంతో ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమాచారం మేరకు అటవీ శాఖ తిరుత్తణి రేంజ్ ఆఫీసర్ విజయసారథి ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం కొండ ఆలయ మాడ వీఽధి. భక్తుల రద్దీగా వుండే ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. అందులో చిక్కుకున్న 25 కోతులను అటవీశాఖ అధికారులు కొండ ఆలయం నుంచి దాదాపు 30 కిమీ దూరంలోని కాపు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
ఐదేళ్ల తరువాత
నిందితుల అరెస్ట్
తిరువళ్లూరు: ఆవడి సమీపంలో జరిగిన హత్యలో ప్రధాన నిందితులుగా వుంటూ గత ఐదేళ్లుగా కోర్టు విచారణకు డుమ్మా కొట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసుస్టేషన్ పరిధిలోని భార్గవినగర్ వెల్లానూరు గ్రామానికి చెందిన మారిముత్తుని 2020వ సంవత్సరంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ కేసును విచారించిన పోలీసులు అదేప్రాంతంలో నివాసం వుంటున్న బాషా, మోహన్, వెంకట్రామన్, బాబు కలిసి హత్య చేసినట్టు గుర్తించి అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసు విచారణ కోర్టులో సాగుతున్న క్రమంలో నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు వాయిదాలకు హాజరుకావాల్సిన మోహన్, వెంకట్రామన్ గత ఐదేళ్లుగా డుమ్మా కొట్టడంతోపాటు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో నివాసాలను మార్చుకుంటూ పోలీసుల కంటపడకుండా పారిపోతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఐదేళ్లుగా విచారణకు హాజరుకాకుండా పరారీలో వున్న హత్య కేసు నిందితులను పట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే తిరుపతిలో తలదాచుకున్న వెంకట్రామన్(75), మోహన్(33)లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా ఇద్దరూ తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.

క్లుప్తంగా