
డెంగీ నిర్మూలన అవగాహన ర్యాలీ
తిరుత్తణి: డెంగీ నిర్మూలనపై పాఠశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు శ్రమదానం శిబిరం నిర్వహిస్తున్నారు. 26వ తేదీన ప్రారంభమైన శిబిరం రెండవ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, పబ్లిక్ ప్రాంతాలను పరిశుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం డెంగీ నిర్మూలన అవగాహన శిబిరం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీని పాఠశాల హెచ్‌ఎం బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఎన్‌ఎస్‌ఎస్ అధికారి లీలా మనోహరన్ సమక్షంలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు 50 మంది పాల్గొని పట్టణంలో చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా వెళ్లి పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు.