
ఘనంగా ఆడియో వేడుక
వీర తమిళచ్చి చిత్ర ఆడియోను ఆవిష్కరించిన ఆర్వీ ఉదయకుమార్, పేరరసు తదితరులతో యూనిట్ సభ్యులు
తమిళసినిమా: మగిళిని కలైకూడం పతాకంపై శారద మణివన్నన్,మగిళిని కలిసి నిర్మించిన చిత్రం వీరం తమిళ్ చూచి. సంజీవ్ వెంకట్, ఇళయ, నటి సుస్మిత సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా సురేష్ భారతి దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈయన ఓ భవన నిర్మాణ కార్మికుడు కావడం గమనార్హం. సినిమాలపై ఆసక్తితో పలు షార్ట్ ఫిలింస్ తీసి వీర తమిళచ్చి చిత్రంతో దర్శకుడుగా అవతారం ఎత్తారు. జూబిన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, దర్శకుడు రాజకుమారన్, శరవణసుబ్బయ్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం చిత్ర దర్శకుడు సురేష్ భారతి మాట్లాడుతూ ఓ భవన నిర్మాణ కార్మికుడినైనా తాను సినిమాల షూటింగ్ కూడా చూడలేదన్నారు. అయినప్పటికీ సినిమాలపై ఆసక్తితో 2016లో కొంచెం కొంచెమాగ అనే షార్ట్ ఫిలిం చేశానన్నారు. దానికి ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదగా ఉత్తమ అవగాహనా లఘు చిత్రం అవార్డును అందుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వరుసగా మొత్తం 18 షార్ట్ ఫిలింస్ చేశానని, వాటిలో ఏది అపజయం పొందలేదని చెప్పారు. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న ఇది వత్తంతో తెరకెక్కించిన ఈ వీర తమిళచ్చి చిత్రం కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ కుటుంబంలో జరిగే అన్ని నిజాలను ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్లంతా వీర తమిళులేనని పేర్కొన్నారు. ఆ విధంగా దర్శకుడు రాజ్ కుమారన్ వీర తమిళుడు అని అన్నారు. ఆయన ఈ వేదికపై వాస్తవాలను గుక్క తిప్పుకోకుండా వల్లించారన్నారు. మనం ఇప్పటివరకు దర్శకుడు రాజకుమారన్ భార్య నటి దేవయానిని చాలా సాఫ్ట్ గానే చూశామని, అయితే ఇంట్లో ఆమె యాక్షన్ హిరోయిన్ అన్నది ఇప్పుడే తెలిసిందని చమత్కరించారు. ప్రయత్నానికి, నిరంతర ప్రయత్నానికి చాలా తేడా ఉందన్నారు. మనం చేసేది ప్రయత్నం అని, మనల్ని వదలని ప్రయత్నం నిరంతర ప్రయత్నం అని పేర్కొన్నారు. అలా ఒక భవన నిర్మాణ కార్మికుడు నిరంతర ప్రయత్నంతో వీర తమిళచ్చి చిత్రం ద్వారా దర్శకుడు అయ్యారన్నారు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఘనంగా ఆడియో వేడుక