
కువ్వత్తూరులో ఏమి జరిగిందంటే..
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిపై అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవి దినకరన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూవ్వత్తూరులో భయంతో వణికి పోయిన పళణి స్వామి ఇప్పుడేమో ప్రగల్బాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో టీటీవీ దినకరన్ మాట్లాడుతూ, అమ్మ జయలలిత మరణం తదుపరి 2017లో చిన్నమ్మ శశికళ బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలో అన్న చర్చ తీవ్రంగానే జరిగిందన్నారు. పళణి స్వామిని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడానికి సిద్ధమయ్యామని, అయితే, ఈ సమయంలో ఆయన వణికి పోయాడని వ్యాఖ్యలు చేశారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ, ఎమ్మెల్యేలు అందరూ జారుకుంటారని, అందరి చేత సంతకాలు పెట్టించుకున్న తర్వాత తనపేరును బహిర్గతం చేయాలని వేడుకున్న వ్యక్తి పళణి స్వామి అని వ్యాఖ్యలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించగానే అనేకమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారని, కొందరు అయితే, కూవత్తూరు నుంచి జారుకునే ప్రయత్నం చేసినా వారందర్నీ కాపాడుకునే విశ్వాస పరీక్షలో పళణి నెగ్గే విధంగా అన్ని రకాల వ్యూహాలను చిన్నమ్మ శశికళతో కలసి తాను రచిస్తే, ఇప్పుడేమో కేంద్రంలోని పాలకులు తనకు పదవి ఇచ్చినట్టుగా ప్రగల్బాలు పలుకుతూ కృతజ్ఞతలను పళణి స్వామి తెలుపుకుంటుండటం విడ్డూరంగా ఉందన్నారు. 122 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుని ప్రభుత్వాన్ని నిలదొక్కునేలా చేస్తే, కేంద్రం సహకరించినట్టుగా పళణి స్వామి చేస్తున్న వ్యాఖ్యలను దయ చేసి కేడర్ పరిగణించాలని సూచించారు. అబద్దాల కోరుగా మారిన ఈ పళణి స్వామికి గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైందన్నారు. అందరూ సమన్వయంగా సమష్టిగా ముందుకెళ్దామని సెంగోట్టయన్ వంటి నేత వ్యాఖ్యలు చేస్తే, చివరకు ఆయన్ని కూడా పనికి రాని వాడుగా, ఎవరికి అణిగి మణిగి ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం శోచనీయమని విమర్శించారు.