
చైన్నెలో 6 చోట్ల ఈడీ దాడులు
సాక్షి, చైన్నె: చైన్నెలో ఆరు చోట్ల, కల్పాకంలో రెండు చోట్ల గురువారం ఎన్ పోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాలు విస్తృతంగా జరిగాయి. మనీ లాండరింగ్ ఫిర్యాదుల, ఆరోపణల ఆధారంగా ఇటీవల కాలంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పలు చోట్ల రాష్ట్రంలో సోదాలు విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో గురువారం ఉదయాన్నే ఈడీ అఽధికారులు పలు బృందాలుగా ఏర్పడి చైన్నెలో ఆరు చోట్ల సోదాలలో నిమగ్నమయ్యారు. ఇందులో సైదా పేటలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న పారిశ్రామిక వేత్త జీఆర్‌కె రెడ్డి నివాసం, ఆయనకు సంబంధించిన మార్గ్ సంస్థల కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. అలాగే, పురసై వాక్కంలోని మోహన్ లాల్ కతారియా అనే బంగారు వర్తకుడి నివాసం,,షావుకారు పేటలోని ఆయన దుకాణాలలో సోదాలు పొద్దు పోయే వరకు జరిగాయి. అలాగే కల్పాకంలోని ఉన్న మార్గ్ సంస్థలకు చెందినవిగా భావిస్తున్న కార్యాలయాలు, మెరికోన్ అనే సంస్థ కార్యాలయాలలో సోదాలు విస్తృతంగా జరిగాయి. సీఆర్‌పీఎఫ్ భద్రత నడుమ సోదాలు క్షుణ్ణంగా నిర్వహించారు. అయితే ఈ సోదాలు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ మనీలాండరింగ్ కేసు విచారణలో లభించిన ఆధారాల మేరకు జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ద్విసభ్య బెంచ్‌కు ఈడీ జరిమానా కేసు
టాస్మాక్‌లో రూ. 1000 కోట్లు అక్రమాలు అంటూ ఇటీవల ఈడీ నిర్వహించిన సోదాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. సినీ నిర్మాత ఆకాశ్ భాస్కరన్, వ్యాపార వేత్త విక్రమ్ రవీంద్రలు ఈ సోదాలకు వ్యతిరేకంగా, ఈడీ చర్యలకు చెక్ పెట్టే విధంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో ఈడీకి పలు మార్లు అక్షింతలు తప్పలేదు. అలాగే జరిమానాను సైతం కోర్టు విధించింది. ఈడీపై కోర్టు ధిక్కార కేసు నమోదుకు ఆకాశ్ భాస్కరన్ పిటిషన్ సైతం దాఖలు చేసి ఉన్నారు.ఈ పరిస్థితులలో తమకు విధించిన జరీమానాను వ్యతిరేకిస్తూ అప్పీలుకు వెళ్తున్నట్టు ఈడీ తరపున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో ఈ జరిమానా కేసును ద్విసభ్య బెంచ్‌కు అప్పగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విచారణ కోర్టు సిఫార్సు చేసింది.