
అనుమతులపై మార్గదర్శకాలు రూపొందించాలి
సాక్షి, చైన్నె : రాజకీయ సభలు, సమావేశాలు బహిరంగ ప్రదేశాలలో నిర్వహణకు సంబంఽధించిన అనుమతుల వ్యవహారంలో కఠిన నిబంధనలతో మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఈనెల 13న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తిరుచ్చి నుంచి ఆయన ప్రచార బహిరంగ సభల ప్రయాణం మొదలైంది. ప్రతి శనివారం లేదా, శని, ఆదివారాలలో ఈ సభలు రెండేసి జిల్లాలో నిర్వహించే విధంగా రూట్‌మ్యాప్ రెడీ చేశారు. అయితే, ఈ సభలకు అనుమతులు వ్యవహారం వివాదాల నడుమ సాగుతోంది. పోలీసులు విజయ్ పార్టీకి కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. కాగా 20వ తేదీ శనివారం నాగపట్నం, తిరువారూర్‌లలో పర్యటించేందుకు విజయ్ సన్నద్ధమయ్యారు. ఈ పరిస్థితులలో తమకు అనుమతుల వ్యవహారంలో విధిస్తూ వస్తున్న కఠిన నిబంధనలు, ఆంక్షలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో విజయ్ తరపున ఆ పార్టీ నేత నిర్మల్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం న్యాయమూర్తి సతీష్‌కుమార్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది రాఘవాచారి హాజరై విజయ్ తరపున వాదనలు వినిపించారు. ఏ ఇతర పార్టీలకు విధించని నిబంధనలు తమకు విధిస్తున్నారని వివరించారు. ఏ మార్గంలో వెళ్లాలి, ఏ మార్గంలో వాహనాలు రావాలి, ఎన్ని వాహనాలు రావాలి అంటూ అన్నీ వారి డైరెక్షన్లో జరగాల్సిందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. ఇతర పార్టీల ప్రచార సభలకు ఇలాంటి నిబంధనలు విధించడం లేదన్నారు. పోలీసుల తరపున హాజరైన న్యాయవాది రాజ్ తిలక్ వాదిస్తూ తిరుచ్చి సభలో చోటు చేసుకున్న పరిణామాల వీడియో, ఫొటోలను న్యాయమూర్తి ఎదుట ఉంచారు.
న్యాయమూర్తి సూచనలు
ఈసందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, ఇంత ఎత్తయిన ప్రదేశాలలోకి ఎక్కినప్పుడే, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత వహించే వారెవ్వరు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిన పక్షంలో వాటిని సరిచేసే వారెవ్వరు అన్న ప్రశ్నలు సంధించారు. గర్భిణిలు, దివ్యాంగులు ఇలాంటి బహిరంగ సభలకు రాకుండా చర్యలు తీసుకుని అందరికీ ఆదర్శంగా ఉండవచ్చుగా అని విజయ్ తరపు న్యాయవాదికి సూచించారు. తాము రావద్దు అని ఆదేశించినా, వచ్చే వారిని ఎలా అడ్డుకోగలమని సమాధానం ఇచ్చారు. ట్రాఫిక్ కష్టాలు ఎదురైనప్పుడు , సమస్యలు నెలకొనప్పుడు వాటికి నష్ట పరిహారం ఎవ్వరు చెల్లిస్తారని ఈసందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అలాగే, కొన్ని సూచనలు చేశారు. బహిరంగ సభల నిర్వహణ గురించి ప్రస్తావిస్తూ, చట్టానికి అందరూ అతీతులుగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. బహిరంగ సభలకు అనుమతుల వ్యవహారంలో కఠిన మార్గదర్శకాలు అవశ్యం అని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఏదేని ఆస్తులకు నష్టం వాటిల్లితే, ఆ నష్టాన్ని భర్తీచేసే విధంగా అనుమతి సమయంలోనే కొంత మొత్తంగా డిపాజిట్ కట్టించుకునే రీతిలో మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.