
విమానాల ఆలస్యంతో ప్రయాణికుల ఇక్కట్లు
న్యూస్‌రీల్
కొరుక్కుపేట: చైన్నె విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు నెమ్మదిగా జరగడంతో సింగపూర్, దుబాయ్, థాయిలాండ్, హాంకాంగ్ సహా వివిధ విదేశీ విమానాల బయలుదేరే సమయాలు ఆలస్యమయ్యాయి. ఫలితంగా, వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వివరాలు.. చైన్నె విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌లో గురువారం ఉదయం సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్, దుబాయ్ సహా వివిధ విదేశాలకు అంతర్జాతీయ విమానాల బయలుదేరడం రెండు గంటల వరకు ఆలస్యమైంది. అంతర్జాతీయ టెర్మినల్‌లో విదేశాలకు బయలుదేరే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ భద్రతా దళాలు తనిఖీ ఆలస్యమైంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అదేవిధంగా, పూణే, హైదరాబాద్, తూత్తుకుడి నగరాలకు వెళ్లే విమానాలు చైన్నె విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్ నుండి దాదాపు 3 గంటలు ఆలస్యంగా బయలుదేరాయి. నగరంలో భారీ వర్షాల కారణంగా, ఉత్తర ప్రాంతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈ విమానాలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.
సైబర్ మోసాలపై విస్తృత అవగాహన
సాక్షి, చైన్నె: సైబర్ సెక్యూరిటీ అవగాహనప్రచారానికి కరూర్ వైశ్యా బ్యాంక్ శ్రీకారం చుట్టింది. తిరుచ్చిలో కేవీబీ సొన్నా..కేలుంగ, డిజిటల్ ఫ్రాడ్‌ల సేకాదింగ అనే నినాదంతో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి తిరుచ్చి పోలీసు కమిషనర్ ఎన్. కామిని ప్రారంభించారు. తిరుచ్చి కలెక్టరేట్‌లో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో సురక్షితమైన డిజిటల్ పద్ధతులు, సైబర్ మోసాలు,వాటిని నుంచి రక్షణ గురించి ఐపీఎస్ కామిని వివరించారు. కేవీబీ నేతృత్వంలో పాఠశాలలు, కళాశాలలు, వృద్దుల సంరక్షణ గృహాలు, ప్రార్థనా స్థలాలు, వివిధ జన సంచార ప్రదేశాలతో పాటుగా సామాజికమాధ్యమాల ద్వారా 60 రోజుల పాటు ఈ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేవీబీ వర్గాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికలకు సిద్ధం కావాలి
శ్రేణులకు కమల్ పిలుపు
సాక్షి, చైన్నె: ఎన్నిలకు పార్టీ వర్గాలు సన్నద్ధం కావాలని మక్కల్ నీది మయ్యం నేత కమల్ పిలుపు నిచ్చారు. మక్కల్ నీది మయ్యం అసెంబ్లీ నియోజకవర్గాల నిర్వాహకులతో గురువారం చైన్నెలో కమల్ శ్రీకారం చుట్టారు. తొలి రోజు రాజా అన్నామలై పురంలో జరిగిన సమావేశానికి 17 జిల్లాల కార్యదర్వులు, 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు తరలి వచ్చారు. డివిజన్ల వారీగా జిల్లాల కార్యదర్శులు, అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో నాలుగు రోజుల పాటుగా సమావేశాలు జరగనున్నాయి. ఇందులో కమల్ మాట్లాడుతూ, ఎన్నికలకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. బలం ఉన్న నియోజకవర్గాలను ఎంపిక చేసి , అక్కడ కార్యక్రమాలు విస్తృతం చేయాలని పేర్కొంటూ, అన్ని నియోజకవర్గాలలోనూ నాయకులు అందుబాటులో ఉండాలని, పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని ఆదేశించారు. కాగా, ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేయని వారు దేశ ద్రోహులతో సమానం అని హెచ్చరించారు.ఓటును అమ్ముకోవద్దు అని హితవు పలికారు. కాగా, ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని సభలో గళాన్ని వినిపించాలని కమల్‌కు నాయకులు విజ్ఞప్తి చేశారు.

విమానాల ఆలస్యంతో ప్రయాణికుల ఇక్కట్లు