
అన్నాడీఎంకే వ్యవహారాల్లో.. బీజేపీ జోక్యం లేదు
కేంద్ర మంత్రి అమిత్ షా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తాను కర్చీఫ్‌తో ముఖం దాచుకోలేదని, ముఖాన్ని తుడుచుకుంటున్న సమయంలో వీడియో చిత్రీకరించి సిగ్గుమాలిన రాజకీయానికి కొన్ని మీడియా సంస్థలు పాల్పడినట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో బీజేపీ జోక్యం లేదని, అంతర్గత వివాదాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
సాక్షి,చైన్నె : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అమిత్ షాతో భేటీ అనంతరం ఓ లగ్జరీ కారులో ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని పళణి స్వామి వెళ్తున్న వీడియో బుధవారం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం స్టాలిన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌తో పాటుగా పలువురు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మాస్క్ పళణి స్వామి అంటూ దినకరన్ ఎద్దేవా చేశారు. ఈ వీడియో వైరల్ కావడం, విమర్శలు బయలు దేరడంతో గురువారం పళణి స్వామి మీడియా ముందుకు వచ్చారు. సేలంలో పార్టీ నేతలు సెమ్మలై ఇలంగోవన్, జయశంకరన్ , ఆర్ మణి, ఎ నల్లతంబితో కలిసి మీడియాతో పళణి స్వామి మాట్లాడారు.
దాచుకోవాల్సిన అవసరం లేదు..
అందరికీ చెప్పే తాను అమిత్ షాతో భేటీ నిమిత్తం ఢిల్లీకి వెళ్లినట్టు పళణి స్వామి వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు తాను ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు. అందరం కలిసి భేటీకి వెళ్లామని, అయితే, తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉండడంతో అందర్నీ అక్కడి నుంచి తాను పంపిం చేశానన్నారు. చివరకు తిరుగు ప్రయాణంలో తనకు కారు లేక పోవడంతో అక్కడున్న కారులో బయటకు వచ్చానని, ఆ సమయంలో ముఖాన్ని కర్చీఫ్‌తో తుడుచుకుంటుండగా దానిని ముఖాన్ని దాచుకున్నట్టు చిత్రీకరించారని ధ్వజమెత్తారు. స్టాలిన్‌కు సంబంధించిన మీడియా సంస్థలు ఈ సిగ్గుమాలిన పనికి ఒడిగట్టినట్టు మండిపడ్డారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల గురించి అమిత్ షా తమతో చర్చించ లేదని, తాను కూడా మాట్లాడ లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వ్యవహారాలలో బీజేపీ పెద్దల జోక్యం లేనే లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఆ లగ్జరీ కారు ఎవరిదో అని ప్రశ్నించగా, తనకు కారు లేని దృష్ట్యా, అక్కడున్న కారు ఇచ్చారని, కార్లు లేనప్పుడు దొరికిన కారులో తాను చేరాల్సిన చోటుకు వెళ్లక తప్పదుగా..? అని దాట వేశారు. ఒక కారు తర్వాత మరో కారు అన్నట్టుగా మార్చాల్సిన అవసరం తనకు లేదన్నారు. తాను మళ్లీ చెబుతున్నానని, అమిత్ షాతో భేటీ గురించి అందరికీ చెప్పే వెళ్లినట్టు స్పష్టం చేశారు. స్టాలిన్ లాగా రహస్య మంతనాలు తాను చేయలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అర్హత లేదు..
టీటీవీకి తన గురించి మాట్లాడే అర్హత లేదని మండి పడ్డారు. అమ్మ జయలలిత జీవించి ఉన్నంత కాలం చైన్నె వైపుగా తలెత్తి కూడా చూడ లేదని, ఆమె మరణం తర్వాత పార్టీలోకి వచ్చారని, తీవ్ర గందరగోళం సృష్టించడంతో బహిష్కరించామన్నారు. పది సంవత్సరాల పాటుగా అడ్రస్సు లేని వ్యక్తి తన గురించి విమర్శలు చేయడమా..? అని మండిపడ్డారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైన కుప్ప కూల్చాలని అనేక కుట్రలు చేశాడని, తమ ప్రభుత్వాన్ని కాపాడినందుకు కేంద్రానికి కృతజ్ఞత తెలుపుకున్నట్టు పేర్కొన్నారు. తాను నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూడండి.. ఏమేరకు అన్నాడీఎంకే బలంగా ఉందో స్పష్టం అవుతుందని హితవు పలికారు.