
బాలికపై చిన్నాన్న లైగింక దాడి
తిరువళ్లూరు: 14 ఏళ్ల బాలికపై లైగింక దాడికి పాల్పడడడంతో పాటూ బాలిక ఆత్మహత్యకు కారణమైన చిన్నాన్నకు 35 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ. 40 వేలు జరిమానా విధిస్తూ తిరువళ్లూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఉమామహేశ్వరి సంచలన తీర్పును వెలువరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పట్టాబిరామ్ అన్నానగర్ ప్రాంతానికి చెందిన తాపీ మేసీ్త్ర వినోద్(30). ఇతడి భార్య ధనలక్ష్మి. ఈ క్రమంలో ధనలక్ష్మి అక్క భర్త నుంచి విడిపోయి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ధనలక్ష్మి తన అక్కకూతురైన 14 ఏళ్ల బాలికను తనతో పాటు ఉంచుకుని పోషించడం ప్రారంభించింది. ఈక్రమంలోనే ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలికను బెదిరించి వినోద్ బాలికపై పలుమార్లు లైగింక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే అంతుచూస్తానని బెదిరింపులకు దిగాడు. అయితే బాలిక విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వినోద్ 2019వ సంవత్సరంలో దుబాయ్‌కు తాపీ పనులకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే ధనలక్ష్మి పట్టాభిరామ్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన మహిళ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వినోద్ దుబాయ్‌కు వెళ్లడంతో విచారణలో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 2021 జనవరి 26న తిరుచ్చికి వినోద్ రాగా, సమాచారం అందుకుని పోలీసులు అతడ్ని అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు. దీంతో పాటూ విదేశాలకు వెళ్లకుండా అతడి పాస్‌పోర్టును సైతం సీజ్ చేశారు. కేసు విచారణలో వున్న సమయంలోనే బాలికను వినోద్ బెదిరించడం ప్రారంభించడంతో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికపై అత్యాచారం, ఆత్మహుతికి కారణమైన రెండు కేసులపై పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో, విచారణ తిరువళ్లూరు పోక్సో కోర్టులో సాగింది. విచారణ పూర్తయిన క్రమంలో న్యాయమూర్తి ఉమామహేశ్వరి తీర్పును గురువారం వెలువరించారు. బాలికపై అత్యాచారం చేయడం, ఆత్మహుతికి పాల్పడేలా బెదిరింపులకు పాల్పడిన వినోద్‌కు 35 ఏళ్ల జైలుశిక్షతో పాటూ రూ. 40 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల శిక్షను అదనంగా అనుభవించాలన్నారు. కోర్టు శిక్ష అనంతరం నిందితుడ్ని పుళల్ జైలుకు తరలించారు.