
సయోధ్యకు నో చాన్స్
సాక్షి, చైన్నె : బహిష్కృతులు, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని మళ్లీ అక్కున చేర్చుకునే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి స్పష్టం చేయడం చర్చకు దారి తీసింది. ఢిల్లీలో మంగళవారం ఆయన బిజీబిజీగా బీజేపీ నేతలతో సంప్రదింపులలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించ బడ్డ వాళ్లు, బయటకు వెళ్లిన వారిని మళ్లీ ఏకం చేయడం, సమష్టి సమన్వయంతో ముందుకు సాగాలన్న నినాదం సీనీయర్ నేత సెంగోట్టయన్ రూపంలోమళ్లీ తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే. గత వారం సెంగోట్టయన్ కేంద్ర మంత్రులతో భేటీ కావడం చర్చకు దారి తీసింది. అందర్నీ సమన్వయ పరిచేందుకు బీజేపీపెద్దలు సయోధ్య ప్రయత్నాలలో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే, పళణి స్వామి మెట్టు దిక్కేనా అన్నది అనుమానంగా మారింది. ఢిల్లీ పర్యటనకు ముందుగా చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయం వంటి అన్నాడీఎంకే కార్యాలయంపై దాడి చేసిన వాళ్లను మళ్లీ అక్కున చేర్చుకోవాలా?, అమ్మ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నం చేసిన వారిని మళ్లీ చేర్చుకోవాలా? అంటూ ఇది కేడర్ మనోభావాలకు వ్యతిరేకం అని పేర్కొన్నారు. ఆత్మాభిమానాన్ని వదలుకునే ప్రసక్తే లేదని, ద్రోహులకు అన్నాడీఎంకేలో చోటు లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం అయితే, మీడియా ప్రశ్నించినా, మౌనం వహించడం గమనార్హం. అదే సమయంలో మంగళవారం ఢిల్లీ వెళ్లిన పళణిస్వామి గంటకు పైగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, పలు అంశాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం. అలాగే, రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి వచ్చిన పిలుపుతో గంటన్నరకు పైగా ఆయన నివాసంలో భేటీ సాగినట్టు సమాచారం. సమన్వయంకు పళణి నిరాకరించినట్టు, బహిష్కృతులను చేర్చుకోవాల్సిన అవసరం లేదని సూచించినట్టు చర్చ జరుగుతోంది. అయితే, ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. పళణి స్వామితో పాటూ ఈ భేటీకి సీనియర్ నేతలు కేపీ మునుస్వామి, ఎస్పీ వేలుమణి, తంబిదురై, ఎంపీలు సీవీ షణ్ముగం, ఇన్బదురైలు వెళ్లారు. బుధవారం కూడా ఢిల్లీలో ఉండే పళణిస్వామి ప్రదాని నరేంద్ర మోదీని కలిసే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసేందుకు నిర్ణయించినట్టు చర్చ జరుగుతోంది.