
నిఘా వలయంలో పరమకుడి
సాక్షి, చైన్నె : రామనాథపురం జిల్లా పరమకుడి పరిసరాలను 7 వేల మంది పోలీసులతో నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడికి ఆరు వందల ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త ఇమాన్యుయేల్ శేఖర్ సంస్మరణ దినోత్సవం గురువారం పరమకుడిలో జరగనుంది. గతంలో ఇక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిణామాలతో ఏటా ఇమాన్యుయేల్ జయంతి, సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా పరమకుడిని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. ఇక్కడకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్‌తో పాటుగా పలు పార్టీల నేతలు తరలి రానున్నారు. దీంతో పరమకుడి పరిసర మార్గాలను నిఘా వలయంలోకి తెచ్చారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాలను జన సందోహం ఇక్కడకు పెద్దఎత్తున తరలి రావడం పరిపాటే. ఈ దృష్ట్యా, ఆరు వందల ప్రత్యేక బస్సులను పరమకుడికి నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. డ్రోన్ల ద్వారా సైతం భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పరమకుడిలో 200 మంది పోలీసు అధికారులతో పాటూ 7 వేల మంది సిబ్బంది భద్రతా విధులలో ఉన్నారు.
భద్రతా విధుల్లో పోలీసులు