
నేపాల్ నుంచి 116 మంది రాక
●తమిళులను రక్షించిన తమిళనాడు ప్రభుత్వం
కొరుక్కుపేట: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు, నేపాల్‌లో చిక్కుకున్న తమిళుల పరిస్థితిని పర్యవేక్షించడానికి, వారికి అవసరమైన సహాయం అందించడానికి, వారిని తిరిగి తీసుకురావడానికి న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ , నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయంతో తమిళనాడు ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి న్యూఢిల్లీ , తమిళనాడు హౌస్ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. నేపాల్‌ను సందర్శించిన తమిళనాడు నుంచి 116 మంది సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇంకా నేపాల్‌లో చిక్కుకున్న తమిళులు తమ వివరాలను అందించడానికి, నేపాల్‌లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకోవడానికి న్యూఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్‌లను సంప్రదించవచ్చని టెలిఫోన్ నంబర్ 011–24193300, మొబైల్ నంబర్: 928951 6712, prcofficetnh@fmai.com,tnhour-e@tn.gov.in ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చునని ప్రభుత్వం పేర్కొంది.
స్టాలిన్ ఆరోగ్య సంరక్షణ శిబిరం
కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాలిన్ వైద్య శిబిరం మాధవరం మండలం 29వ వార్డు జీఎన్ డీలోని ప్రైవేట్ కళాశాల ఆవరణలో జరిగింది. మంత్రి సుబ్రమణియన్ పాల్గొని హెల్త్ కేర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సీఎం స్టాలిన్ ఆరోగ్య శిబిరంలో ప్రజలకు అందిస్తున్న కేంద్రాలను సందర్శించి, చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా కార్డు , వికలాంగులకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. కార్మిక సంక్షేమం నైపుణ్యాభివృద్ధి శాఖ తరపున, ఆయన అసంఘటిత కార్మికులకు సంక్షేమ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మాధవరం మున్సిపల్ కౌన్సిల్ అసిస్టెంట్ గణేశన్, జోనల్ కమిటీ చైర్మన్ నందగోపాల్, చంద్రన్, కౌన్సిలర్లు కార్తికే ఏలు మలై, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రికెటర్ అశ్విన్, దర్శకుడు వెట్రిమారన్‌కు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం
కొరుక్కుపేట: క్రికెటర్ అశ్విన్, దర్శకుడు వెట్రిమారన్‌కు గౌరవ డాక్టరేట్లును వేల్స్ ఇన్‌స్టిట్యూట్ తరపున ప్రదానం చేశారు. చైన్నెలోని పల్లవరంలో ఉన్న వేల్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆట్స్ 15వ స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరై క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన క్రికెటర్ అశ్విన్, సినీ పరిశ్రమలో అద్భుత విజయం సాధించిన శ్రీ గోకులం గ్రూప్ వ్యవస్థాపకుడు ఛైర్మన్ ఎ.ఎం. గోపాలన్, అనేక చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ అవార్డులు గెలుచుకున్న దర్శకుడు వెట్రి మారన్‌కు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మొత్తం 4,992 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల్స్ ఎడ్యుకేషన్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రీతా గణేష్, రిజిస్ట్రార్ డాక్టర్.పి.శరవణన్, వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎం.భాస్కరన్, అసోసియేట్ ఛాన్సలర్ డాక్టర్.ఎ.జ్యోతి మురుగల్, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
15 నుంచి మురుగునీటి శుద్ధి కేంద్రం మూత
తిరువొత్తియూరు: గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ తరపున జీవా రైల్వే మురుగునీటి ప్రధాన పంపింగ్ పైప్‌లైన్ మార్పిడి పనుల కారణంగా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పురసైవాక్కం మురుగునీటి శుద్ధి కేంద్రం పనిచేయదని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు చైన్నె మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు విడుదల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మురుగునీటి ప్రధాన పంపింగ్ పైప్‌లైన్‌ను మార్చే పనులు చేపడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

నేపాల్ నుంచి 116 మంది రాక