
83 శాతం అర్జీల పరిష్కారం
సాక్షి, చైన్నె: మీతో స్టాలిన్ శిబిరాలతో 83 శాతం విజ్ఞప్తులు పరిష్కరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను దరి చేర్చే దిశగా, వివిధ సేవలను ముంగిటకు తీసుకెళ్తూ మీతో స్టాలిన్ శిబిరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అధికారులు, కార్యాలయాల చుట్టు జనం తిరగాల్సిన పని లేకుండా ఈ శిబిరాలు మరింత దోహదకరంగా మారి ఉన్నాయి. 46 రకాల ప్రభుత్వ సేవలు ఈ శిబిరాల ద్వారా అందిస్తున్నారు. వీటికి వచ్చే ఫిర్యాదులను సీఎం స్టాలిన్ స్వయంగా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మరో రోజులో తొలి విడత శిబిరాల ప్రక్రియను ముగించి, మలి విడత దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ పరిస్థితులలో శనివారం ఈ శిబిరాలలో వచ్చిన ఫిర్యాదులు తదితర అంశాలపై సీఎం స్టాలిన్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు.
పరిష్కారాలు..
ఈ శిబిరాల ద్వారా 14,54,517 దరఖాస్తులు ఇప్పటి వరకు వచ్చినట్టు , ఇందులో 7,23,482 పరిష్కరించినట్లు సమీక్షలో తేలింది. మరో 5,97,534 పరిగణనలోకి తీసుకుని ఉండడంతో ఈ శిబిరాల ద్వారా 83 శాతం అర్జీలను క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ, సహకార శాఖ, ఆది ద్రావిడర్ సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ , గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖలకు వచ్చిన విజ్ఞప్తులపై మరింత శ్రద్ధ వహించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ రంగంలో రైతు ప్రయోజనాల దిశగా సమస్యలు వెంటనే పరిష్కరించ బడాలని ఆదేశించారు. రేషన్ కార్డులలో చిరునామా మార్పునకు సంబంధించ్లి, ఇంటి, స్థల పట్టాలకు సంబంధించిన విజ్ఞప్తులను అత్యవసరంగా పరిగణించాలని సూచించారు. కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, అదనపు ప్రధాన కార్యదర్శి అముద, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. ఉదయచంద్రన్, తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సీఎం స్టాలిన్ ఆదివారం కృష్ణగిరిలో పర్యటించనున్నారు. ఇక్కడ రోడ్ షో నిర్వహణకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, డీఎంకేను తాకడం ఎవరి తరం కాదని, డీఎంకే అంటే ఒక ఉద్యమం అని పేర్కొంటూ, సీఎం స్టాలిన్ కేడర్‌కు లేఖ రాయడం గమనార్హం. డీఎంకే నీడను ఎవ్వరు తాకను కూడా తాకలేరని హెచ్చరించారు.