
నాన్ మొదల్వన్ మరింత విస్తృతం
సాక్షి, చైన్నె : నాన్ మొదల్వన్ పథకం మేరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ, బహ్రెయిన్ అహ్లియా విశ్వవిద్యాలయంతో పాటూ మరికొన్ని విద్యా సంస్థల మధ్య శనివారం ఒప్పందాలు జరిగాయి. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో మరికొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. చైన్నెలోని నందంబాక్కం వర్తక కేంద్రంలో అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ ఫోరం కార్యక్రమం జరిగింది. తమిళనాడు నైపుణ్యాభివృద్ధి సంస్థ, బహ్రెయిన్‌కు చెందిన అహ్లియా విశ్వవిద్యాలయంతో కలిసి నాన్ మొదల్వన్ పథకం కార్యక్రమాలను విస్తృతం చేసే దిశగా ఇందులో ఒప్పందాలు జరిగాయి. విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ అసోసియేషన్ సమావేశంలో విద్యా, శిక్షణా ఒప్పందాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు మెరుగైన శిక్షనతో ఉపాఽధి, ఉద్యోగ అవకాశాల కల్పన నాన్ మొదల్వన్ లక్ష్యంగా గుర్తు చేస్తూ ఇటీవల సీఎం స్టాలిన్ విదేశీ పర్యటన గురించి వివరించారు. ఎవరికి వారు వారి వారి రంగాలలో నిపుణులు అని పేర్కొంటూ, ఇంజినీర్లు మల్టీ–టాలెంటెడ్ పర్సన్స్ అని కితాబు ఇచ్చారు. దేశంలోనే అత్యధిక మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని గుర్తు చేస్తూ, ఇందులో తమిళనాడు మరింత ముందంజలో ఉందన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య కాదు, విద్యార్థులకు మెరుగైన శిక్షణతో ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వివరించారు. టైడల్ పార్క్, ఐటీ కారిడార్లు, ఆటోమొబైల్ హబ్‌ల రూపకల్పతో ఉపాధి అవకాశాలు విస్తృతం అయ్యాయన్నారు. తమిళనాడు, తమిళ సమాజం అభివృద్ధే లక్ష్యంగా విస్తృత పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు శివశంకర్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, అంతర్జాతీయ తమిళ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సి. సెల్వం, పి. కృష్ణ జగన్, అహ్లియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డాక్టర్ మన్సూర్ అలాలి, కువైట్ ప్రజా రవాణా ప్రతినిధి మన్సూర్ అల్ సయీద్, మాల్దీవుల ఆర్థిక అభివృద్ధి మాజీ మంత్రి, ఫయేజ్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.