
జన జాతర!
జనసంద్రమైన తిరుచ్చి
ఊహించని రీతిలో విజయ్‌కు అభిమానోత్సహం
6 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం
ఎన్నికల ప్రచారానికి టీవీకే నేత శ్రీకారం
ఆలస్యంగా సాగిన అరియలూరు, పెరంబలూరు పర్యటన
ఎన్నికల రథంపై నుంచి ప్రసంగిస్తున్న విజయ్
సాక్షి, చైన్నె : గత ఏడాది తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన విజయ్ తాజాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లే దిశగా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు మహానాడులను జయప్రదం చేసుకున్న విజయ్, శనివారం తిరుచ్చి వేదికగా ఎన్నికల ప్రచార పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఉదయం తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న విజయ్ ప్రత్యేక ప్రచార రథంలోకి ఎక్కి అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగారు. విజయ్ ఎలాంటి రోడ్ షోలు నిర్వహించేందుకు వీలు లేదని ముందుగానే పోలీసులు ఆంక్షలు విధించిన దృష్ట్యా, ఆయన ప్రత్యేక ప్రచార రథంలోపలే కూర్చుని తన కోసం వేచి ఉన్న కేడర్‌ను, ప్రజలకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు.
ఊహించని రీతిలో జన సందోహం..
విజయ్‌కు తిరుచ్చి ఎన్నికల ప్రచార పర్యటనకు గంట సమయాన్ని మాత్రమే పోలీసులు కేటాయించారు. అయితే పోలీసులే కాదు, తమిళగ వెట్రి కళగం వర్గాలు సైతం ఊహించని రీతిలో జన సందోహం తండోపతండాలుగా పోటెత్తారు. విమానాశ్రయం నుంచి టీవీఎస్ టోల్ గేట్ మీదుగా మరక్కడై ఎంజీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని, ఇక్కడ జరిగే ప్రసంగంతో ఎన్నికల ప్రచారాన్ని విజయ్ శ్రీకారం చుట్టేందుకు ముందుగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. విమానాశ్రయం నుంచి ఈ మరక్కడై ప్రాంతం 6 కి.మీ దూరంలో ఉంది. అయితే ఊహించని రీతిలో తిరుచ్చిల్లోకి అభిమానం తరలి రావడంతో కట్టడి చేయలేని పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా జన సందోహం, ఏ రోడ్డు చూసినా ఇసుకేస్తే రాలనంతంగా అభిమానులు , ప్రజలు తరలి రావడంతో విజయ్..., విజయ్...., సీఎం..సీఎం అన్న నినాదాలు మార్మోగాయి. విజయ్ మరక్కడైకు వచ్చేలోపు అక్కడక్కడ రద్దీలో వేచి ఉన్న వాళ్లు స్పృహ తప్పారు. గాంధీ మార్కెట్ మార్గంలో సుమారు ఆరుగురు స్పృహ తప్పడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడక్కడ యువతీ, యువకులు పార్టీ జెండాతో నృత్య ప్రదర్శనలను హోరెత్తించారు. విజయ్ ప్రచార రథంపై పువ్వుల వాన అనేక చోట్ల కురిసింది. విజయ్ వెళ్లే మార్గంలోని భవనాలు, చెట్లు, హోర్డింగ్‌ల పైకి సైతం అభిమానులు ఎక్కేశారు. ఆయన్ని చూడాలనే ఉత్సహంతో రంకెలు వేశారు. జన సాగరంలో తిరుచ్చి మునిగినట్టుగా పరిస్థితి నెలకొనడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం తప్పలేదు. కేంద్రమాజీ మంత్రి పి చిదంబరం సైతం గంట పాటుగా ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన ప్రయాణీకులు మరింతగా ఇబ్బంది పడ్డారు. తరలి వచ్చిన అభిమానుల్ని కట్టడి చేయలేక తమిళగ వెట్రి కళగం వర్గాలే కాదు, పోలీసులు సైతం చోద్యం చూడక తప్పలేదు. తిరుచ్చి విమానాశ్రయంలో 9.40 గంటల ప్రాంతంలో అడుగు పెట్టిన విజయ్ మిగిలిన 6 కి.మీ దూరాన్ని ఐదు గంటల పాటుగా ప్రయాణించి మరక్కడైకు మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో చేరుకున్నారు.
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
మరక్కడై పరిసరాలలోని దుకాణాలన్ని మూత బడ్డాయి. ఉదయం 10.30–11.30 గంటల వరకే విజయ్ సభకు అనుమతి ఇచ్చారు. జన సాగరాన్ని దాటి 2.45 గంటలకు ఇక్కడకు వచ్చిన ఆయన తొలిసారిగా ప్రచార రథం పైకి వెళ్లి తన కోసం వేచి ఉన్న జనం, అభిమానుల్ని విజయ్ పలకరించారు. అభివాదం తెలుపుతూ 20 నిమిషాల పాటూ ప్రసంగించారు. దివంగత నేతలు పెరియార్, అన్నా, ఎంజీఆర్‌లు తిరుచ్చి నుంచే తమ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. తిరుచ్చి అంటే మలుపునకు వేదిక అని వ్యాఖ్యలు చేస్తుండగా, సాంకేతిక సమస్య కారణంగా మైక్ పని చేయలేదు. లైవ్‌లో విజయ్ ప్రసంగం కోసం ఎదురు చూసిన వారందరికి నిరాశ తప్పలేదు. విజయ్ ప్రచార రథానికి సమీపంలో ఉన్న వారికి మాత్రమే ఆయన ప్రసంగం వినే అవకాశం దక్కింది. ఆదిలోనే మైక్ అడ్డంకులు ఎదురైనా విజయ్ మాత్రం తన ప్రసంగాన్ని చకచకా ముగించారు. మత సామరస్యానికి ప్రతీక తిరుచ్చి గడ్డ అని పేర్కొంటూ, ఇక్కడి ప్రజల్ని చూసి వెళ్దామని తాను వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. కొన్ని మట్టిని తాకితే చాలా మంచిదని, కొన్నిమంచి కార్యక్రమాలు ఇక్కడి నుంచే చేపడితే మరింత మంచిదని పెద్దలు చెప్పి ఉన్నారని పేర్కొంటూ, అందుకే తిరుచ్చిలో తాను ఎన్నికల ప్రచారం కు శ్రీకారం చుడుతున్నానని వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్లే ముందు, యుద్ధంలో గెలవడానికి దేవతా మూర్తులు ఆలయానికి వెళ్లి పూజించే వారని గుర్తు చేశారు. ఆదిశగా ఎన్నికలకు వెళ్లే ముందు నేను తన వాళ్లని చూడటానికి ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. తిరుచ్చికి చాలా చరిత్ర ఉందని, పెరియార్ నివసించిన ప్రదేశం కూడా అంటూ గుర్తు చేశారు. మలైకోట్టై ఉన్న ప్రదేశం కూడా తిరుచ్చి అంటూ ఇక్కడి జన సందోహాన్ని చూస్తుంటే తన హృదయం పులకించిందని,భావోద్వేగం కలుగుతున్నట్టు వ్యాఖ్యలు చేశారు.
‘ఎటు చూసినా జనమే. ఏ వీధులలో చూసినా ఇసుకేస్తే రాలనంతంగా జన సందోహం. 6 కి.మీ దూరాన్ని దాటేందుకు ఐదు గంటల సమయం.’ ఇది దళపతి విజయ్‌కు అభిమానుల నీరాజనం. తిరుచ్చి జన సాగరంలో కలిసినట్టుగా శనివారం తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఎన్నికల ప్రచార శంఖారావం పర్యటన పరిస్థితి. ఎవ్వరూ ఊహించని రీతిలో తరలి వచ్చిన అభిమానుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ, పోలీసు ఆంక్షలకు అనుగుణంగా పూర్తి స్థాయి రాజకీయ ప్రచారంలోకి విజయ్ ముందడుగు వేశారు.
హామీలు ఏమయ్యాయి..?
2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 505 ఎన్నికల హామీలు ఇచ్చిందని, వాటిలో ఎన్ని నెరవేర్చారు? అని ప్రశ్నించారు. డీజిల్ ధర రూ. 3 తగ్గింపు ఎక్కడ, నెలవారీ విద్యుత్ బిల్లుల లెక్కింపు ఎక్కడ, విద్యార్థుల విద్యా రుణాల రద్దు ఏమయ్యాయి? , ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్లు, పాత పెన్షన్ పథకం, 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను భర్తీ.... ఇవన్నీ ఏమయ్యాయి? అని డీఎంకే పాలకులను ప్రశ్నించారు. ప్రశ్నలు సంధించినా డీఎంకే నుంచి స్పందన ఉండదని, సీఎం గారు , ఓ మారు తిరుచ్చి ప్రజల గొంతు వినండి అంటూ అభిమానుల నినాదాలను హోరెత్తింప చేశారు. డీఎంకే సభ్యుడికి చెందిన ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ జరిగిందని ఆరోపిస్తూ, బస్సుల్లో మహిళలకు ఉచితంగా అనుమతిస్తూ ’ఓసీ, ఓసీ’ అని వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. విద్య, విద్యుత్, ఆరోగ్యసంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం, మహిళల భద్రత, చట్టపరమైన సమస్యలపై పడకుండా, ఆచరణాత్మకమైనది ఏదైనా సరే అమలు చేసే విధంగా తన పయనం ఉంటుందంటూ ఎన్నికలలో విజయం ఖాయం. మళ్లీ కలుద్దాం అంటూ 20 నిమిషాలలో ప్రసంగాన్నిముగించారు. ఇక్కడి నుంచి విజయ్ ప్రచార రథం మళ్లీ జాతీయ రహదారి వైపుగా వెళ్లే వరకు జనాన్ని కట్టడి చేయలేక పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది. తిరుచ్చి – తంజావూరు జాతీయ రహదారి నుంచి అరియలూరు, పెరంబలూరు వైపుగా విజయ్ ప్రచార ప్రయాణం సాగింది. తిరుచ్చిలో ఆలస్యం కావడంతో ఇక్కడ కూడా నిర్ణీత సమయంలో కాకుండా, ఆలస్యంగా ప్రచార పయనాన్ని విజయ్ కొనసాగించాల్సి వచ్చింది. విజయ్ గణనీయంగానే ఓట్లను సాధించే అవకాశం ఉందని, తాజాగా తరలి వచ్చిన జన సందోహాన్ని చూసి వీసీకే నేత, ఎంపీ తిరుమా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ స్పందిస్తూ వచ్చిన అభిమానం అంతా ఓటుగా మారేనా అన్నది వేచి చూడాల్సిందేనని వాఖ్యానించారు. బీజేపీ మహిళా నేత తమిళి సై సౌందరరాజన్ స్పందిస్తూ, విజయ్‌కు ఊహించని రీతిలో జనం వచ్చారని, ఇదంతా అభిమానమే అని వ్యాఖ్యలు చేశారు.

జన జాతర!

జన జాతర!

జన జాతర!

జన జాతర!

జన జాతర!