మణలిలో ట్రాఫిక్ రద్దీ
తిరువొత్తియూరు: చైన్నె మణలి కామరాజర్ రోడ్డులో నీటి సరఫరా ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నందున గత 2 సంవత్సరాలుగా రోడ్డు దెబ్బతింది. అంతేకాకుండా, రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పెరగడంతో వాహనాలు సజావుగా వెళ్లలేకపోతున్నాయి, దీంతో మణలి మార్కెట్ జంక్షన్ వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇక కామరాజర్ రోడ్డు లో ట్రాఫిక్ నివారించడానికి, కార్లు, బైక్‌లు వంటి వాహనాలు మణలి పార్థసారథి వీధి, కె.కె.తాళై రోడ్డు మీదుగా వెళ్లి మాధవరం డైరీ ఫామ్ రోడ్డులో కలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూగర్భ మురుగునీటి ప్రాజెక్ట్ పనుల కోసం పోప్‌జాన్ గార్డెన్ ప్రాంతంలో రోడ్డు మూసివేశారు. దీంతో ఇరుకై న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించాల్సి రావడంతో ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది.
తిరువొత్తియూరు ఫ్యాక్టరీలో కార్మికుల నిరాహార దీక్ష
తిరువొత్తియూరు: చైన్నెలోని తిరువొత్తియూరు విమ్‌కో నగర్‌లో పనిచేస్తున్న ఎం.ఆర్.ఎఫ్. ప్రైవేట్ టైర్ల తయారీ కర్మాగారంలో పనిచేస్తున్న 62 మంది ట్రైనీలు గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో తమను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ, కార్మిక సంఘం నాయకుడు ఎళిల్ కెరోలిన్ నాయకత్వంలో కార్మిక సంఘం భవనం వద్ద కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ట్రైనీలను 4 సంవత్సరాలలో శాశ్వత ఉద్యోగులుగా చేయాల్సి ఉందని కానీ..యాజమాన్యం 6 సంవత్సరాలకు పైగా గడిచినా వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయకపోవడంతో వారికి పని భారం పెరిగి, జీవనోపాధి దెబ్బతింటోందని వారు ఆరోపించారు. వెంటనే యాజమాన్యం వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్నారు.
టాస్మాక్ ఉద్యోగిపై దాడి
– నలుగురి కోసం గాలింపు
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా మరైమలైనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవిందపురం ప్రాంతంలో ఓ టాస్మాక్ దుకాణం ఉంది. ఇక్కడ సేల్స్‌మెన్‌గా సింగపెరుమాళ్ ఆలయం పక్కన ఉన్న హనుమంతపురంలోని చందకుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ (48) రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు .ఈ స్థితిలో, శనివారం దాదాపు 25 ఏళ్ల వయస్సున్న నలుగురు వ్యక్తుల బృందం టాస్మాక్ దుకాణానికి మద్యం తాగడానికి వచ్చారు. వారు బీరు సీసాలు కొని దుకాణం దగ్గర కూర్చుని తాగుతున్నారు. ఆ సమయంలో టాస్మాక్ దుకాణం నుండి బీరు బాటిళ్లను దించే లారీ వచ్చింది, దీంతో వారిని వేరే చోటికి వెళ్లి తాగమని రాజేంద్రన్ చెప్పాడు. దీంతో ఇరువర్గాలు తీవ్ర వాగ్వాదానికి దిగాయి. కోపంతో ఆ నలుగురు రాజేంద్రన్‌పై తీవ్రంగా దాడి చేసి, పారిపోయారు. రాజేంద్రన్‌ను స్థానికులు అతన్ని రక్షించి సింగపెరుమాళ్ ఆలయ ప్రాంతంలోని ప్రభుత్వ అత్యవసర ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజేంద్రన్ మరైమలైనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
విజయవంతంగా
మారిటైమ్ సమ్మిట్
– మారిటైమ్ లా ఏర్పాటు
సాక్షి, చైన్నె : వినాయక మిషన్ లా స్కూల్ సెంటర్ ఫర్ మారిటైమ్ లా, హోస్ట్‌లను ప్రారంభించింది. ఇందులో భాగంగా మారిటైమ్ లా సమ్మిట్ 2025 పయ్యనూర్ క్యాంపస్‌లో విజయంతంగా శనివారం నిర్వహించారు. వినాయక మిషన్ పరిశోధన , రాజ్యాంగ కళాశాల ఫౌండేషన్ ఓ మైలురాయి సాధించిందని ప్రకటించారు. ఈ మేరకు సెంటర్ ఫర్ మారిటైమ్‌లా (సీఎంఎల్)ను ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ లా సమ్మిట్ కార్గో, కాంట్రాక్టులు , క్లెయిమ్‌ల కోసం కోర్సును చార్టింగ్ చేయడం అనే థీమ్‌పై 2025 సమ్మిట్ జరిగింది. ఈ ప్రారంభ సమావేశానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కుమార్ హాజరయ్యారు. డాక్టర్ ఎ. ఫ్రాన్సిస్ సహా ప్రముఖులు జూలియన్, సీనియర్ న్యాయవాది అమితవ (రాజా) మజుందార్ ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్ మాట్లాడుతూ, నాలుగు కేంద్రాల ద్వారా భవిష్యత్తు–కేంద్రీకృత న్యాయ విద్యను ముందుకు తీసుకెళ్లాలనే దృష్టి పెటాటమన్నారు. ప్రొఫెసర్ శరవణన్ ద్వారా రూపొందించబడిన విద్యా–పరిశ్రమ–విధాన సహకారాన్ని గుర్తుచేశారు. ఆ విద్యా సంస్థ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.ఎస్. గణేషన్, ఉపాధ్యక్షులు డాక్టర్ అనురాధ గణేష్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జె. సురేష్ సామ్యూల్‌తదితరులు సెంటర్ ఫర్ మారిటైమ్ లా ప్రారంభం గురించి వివరించారు.
వీసీకే కార్యకర్తల ఘర్షణ
తిరువొత్తియూరు: చైన్నెలోని మెరీనా బీచ్ రోడ్డులోని డీజీపీ కార్యాలయం సమీపంలో విడుదలై చిరుతైగల్ పార్టీ (వీసీకే) అధినేత ఎయిర్‌పోర్ట్ మూర్తి, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.వీసీకే అధినేత తిరుమావళవన్ గురించి ఎయిర్‌పోర్ట్ మూర్తి యూట్యూబ్‌లో అభ్యంతరకరంగా మాట్లాడినట్లు ఆరోపిస్తూ, వీసీకే కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ మూర్తిపై దాడి చేశారు. ఎయిర్‌పోర్ట్ మూర్తి కూడా వారిపై దాడి చేశాడు. డీజీపీ కార్యాలయం ముందు భద్రతా విధుల్లో ఉన్న ఒకే ఒక పోలీసు అధికారి దాడి చేస్తున్న వారిని ఆపడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో వీసీకేకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.