
క్లుప్తంగా
ప్రాణం తీసిన ఈత సరదా
తిరువళ్లూరు: ఈత సరదా ఓ బాలుడి నిండు ప్రాణం తీసింది. తిరువళ్లూరు జిల్లా కై వండూరు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ ఆనందన్. ఇతని కుమారుడు సాలమోన్ స్థానికంగా వున్న పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. అక్కడ ఈత కొడుతూ చెరువలో మునిగిపోయాడు. గుర్తించిన స్థానికులు వెంటనే నీటి నుంచి సామోన్‌ను బయటకు తీసి తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు దర్యాప్తును చేస్తున్నారు.
యువకుడిపై దాడి
–ముగ్గురి అరెస్టు
పళ్లిపట్టు: ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడిచేసిన సంఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పొదటూరుపేట పోలీసుల కథనం మేరకు.. అత్తిమాంజేరిపేట గాంధీనగర్‌కు చెందిన శివ కుమారుడు బాలమురుగన్(23) పొదటూరుపేటలో సెల్‌ఫోన్ సర్వీసు దుకాణం నడుపుతున్నాడు. అతను శుక్రవారం రాత్రి గ్రామానికి శివారులో అతని మిత్రుడు జ్యోతిలింగంతో మాట్లాడుతుండగా అక్కడికి వెళ్లిన యువకులు ముగ్గురు బాలమురుగన్‌పై దాడిచేశారు. అడ్డుకున్న జ్యోతిలింగంను సైతం కర్రతో దాడిచేశారు. ఎస్‌ఐ సుగంధి కేసు నమోదు చేసి చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని తొట్టికండ్రిగ గ్రామానికి చెందిన దేవ(23) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో అతని మిత్రు లు బన్నీ, కిషోర్ తన వెంట తీసుకొచ్చి దాడిచేసినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. తరువాత వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
మద్యం మత్తులో కారుకు నిప్పు
తిరుత్తణి: మద్యం మత్తులో ఓ వ్యకి కారుకు నిప్పు పెట్టిన ఘటనలో కారు దగ్ధమైంది. ఈ ఘటన తిరువలంగాడు ప్రాంతంలో చోటుచేసుకుంది. పళయనూరు గ్రామానికి చెందిన నాగరాజు(45) ట్రావల్స్ నడుపుతున్నారు. ఇతను శనివారం ఇంటి వద్ద కారులో మద్యం తాగి సిగరెట్ వెలిగించి కారుకు నిప్పుపెట్టాడు. మంటల్లో కారు దగ్ధమైంది. తిరువలంగాడు పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని కారును పరిశీలించి విచారించగా నాగరాజు మద్యం మత్తులో నా కారు నాఇష్టం అని పోలీసుల వద్ద దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. కారు దగ్ధంకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని బాలిక మృతి
తిరువొత్తియూరు: పోరూర్‌లో స్కూటీని ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో ఓ బాలిక మృతిచెందింది. బాలికతో పాటు వెళ్తున్న స్నేహితురాలు, బంధువు అయిన మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చైన్నె పోరూర్‌కు చెందిన గణేష్ కుమార్తె యోగశ్రీ (10). ఈమె పోరూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. ఆమె స్నేహితురాలు అప్సియా (10). యోగశ్రీ బంధువు శారద (17). శనివారం ఉదయం శారద తన స్కూటీలో యోగశ్రీ, అప్సియాలను ఐయప్పన్తాంగల్‌లో ఉన్న ఫుట్‌బాల్ శిక్షణ కేంద్రానికి తీసుకెళ్తోంది. పోరూర్ సమీపంలో వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకులో వెళుతున్న ముగ్గురూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో లారీ యోగశ్రీ తలపై వెల్లడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందింది. అప్సియా, శారదకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోరూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కూల్చివేత పనులు ముమ్మరం
తిరువొత్తియూరు: చైన్నెలో ప్రసిద్ధి చెందిన బ్రాడ్‌వే బస్‌స్టేషన్ ఉంది. ఈ నేపథ్యంలో, బ్రాడ్‌వే బస్‌స్టేషన్ , కురలగం భవనం పక్కన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్‌న్స్‌పోర్ట్ టెర్మినల్ , కార్యాలయ సముదాయం నిర్మించనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో, బ్రాడ్‌వే బస్‌స్టేషన్ స్థానంలో రాయపురంలో తాత్కాలిక బస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. బ్రాడ్‌వే బస్‌స్టేషన్ ఉన్న స్థలంలో 9 అంతస్తుల వాణిజ్య సముదాయంతో కూడిన బస్‌స్టేషన్ నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా, పక్కనే ఉన్న కురలగం భవనాన్ని కూల్చివేసి 10 అంతస్తుల వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ విధంగా, పురాతన కురలగం భవనాన్ని కూల్చివేసే పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు.
బైకును దూడ ఢీకొని
వ్యక్తి మృతి
తిరుత్తణి: బైకును దూడ ఢీకొని ఓ ఆటోడ్రైవర్ మృతిచెందిన ఘటన శోకాన్ని మిగిల్చింది. అరక్కోణం సమీపంలోని పరమేశ్వమంగళం గ్రామానికి చెందిన బాలు(50) ఆటోడ్రైవర్. శనివారం ఉదయం తిరువలంగాడు సమీపంలోని వ్యాసపురం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి బైకులో బయలుదేరి వెళ్లాడు. వ్యాసపురం క్రాస్ వద్ద వెళుతుండగా అడ్డంగా దూడ రావడంతో బైకును ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలును స్థానికులు తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. తిరువలండగాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా