
యువత స్వశక్తితో ఎదగాలి
కొరుక్కుపేట: యువత స్వశక్తితో ఎదగాలని రాష్ట్ర సమాచార సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ సేవల మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పిలుపునిచ్చారు. వీఐటీ చైన్నె 13వ వార్షిక స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పాల్గొని ర్యాంక్ హోల్డర్లు, పీహెచ్‌డీ స్కాలర్లకు పతకాలు, డిగ్రీ పట్టాలను అందజేశారు. గౌరవ అతిథిగా చైన్నెలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెల్లీ సలేహిన్ హాజరయ్యారు. వీఐటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వీఐటీ ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, డాక్టర్ జి.వి. సెల్వం పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ యువత తమ సొంత దృక్పథాన్ని, మార్గాన్ని అనుసరించాలని హితవు పలికారు . చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ ఇంతమంది యువత నాణ్యమైన ఉన్నత విద్యను పొందగలిగారంటే, అది ప్రధానంగా తల్లిదండ్రుల పెట్టుబడి వల్లేనని, ఉన్నత విద్యలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. మొత్తం 6,581 మంది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, స్కాలర్లు తమ డిగ్రీలను అందుకున్నారని వివరించారు. వీఐటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ఎస్. కాంచన, ప్రొ–వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.త్యాగరాజన్, ప్రొ–వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పార్థసారథి మాలిక్, రిజిస్ట్రార్ డాక్టర్ టి.జయభారతి పాల్గొన్నారు.