
వర్షాలతో జలకళ
పళ్లిపట్టు: పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయాలు వేగంగా నిండుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశా రు. తిరుత్తణి, పళ్లిపట్టు పరిసర ప్రాంతాల ప్రజల ప్రధాన జీవనాధారంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావంపై ఆధారపడి పంట సాగు చేసి కుటంబ పోషణగా ఉంది. గతకొద్ది రోజులుగా సాయంత్రం, రాత్రి సమయాల్లో కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కొండల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జలాశయాలు నిండుతున్నాయి. పళ్లిపట్టు లోని కుశస్థలి నదికి వరదనీరు ప్రవేశం క్రమంగా పెరుగుతోంది. బావులు, బోర్లతో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంతో తాగునీటి సమస్యలు తొలగి పంట భూములకు నీటి ఎద్దడి పరిష్కారం కానుంది. ప్రధానంగా జిల్లా ప్రజల నీరు ఆధారంగా ఉన్న కుశస్థలి నదికి వరదనీరు రాక అధిగమిస్తున్న క్రమంలో పళ్లిపట్టు, సొరకాయపేట, ఇళుప్పూరులోని చెక్‌డ్యాంలు నిండి కళకళలాడుతున్నాయి. దీంతో తీర ప్రాంతాల ప్రజలతోపాటు రైతులు హర్షం వ్యక్తం చేశారు. వర్షాలు కొనసాగితే త్వరలో నదిలో వరద ప్రవాహం చోటుచేసుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు.
కోర్టుకు డీజీపీ నియామకం
సాక్షి, చైన్నె: శాంతి భద్రతల విభాగం డీజీపీగా వెంకటరామన్ నియమకం సుప్రీం కోర్టుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు దిక్కార కేసు నమోదు చేయాలంటూ ఓపిటిషన్‌సోమవారం దాఖలైంది. రాష్ట్ర డీజీపీ శంకర్ జివాల్ ఆదివారం పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక డీజీపీగా వెంకటరామన్‌ను నియమించారు. అయితే, డీజీపీ నియమకంలో నిబంధనలకు తిలోధకాలు దిద్దారని, కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు తుంగలో తొక్కబడ్డాయని పేర్కొంటూ, ఈ నియామకానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
డచెస్ ఉత్సవ్ ఆరంభం
కొరుక్కుపేట: డచెస్ క్లబ్ ఆధ్వర్యంలో రెండు రోజుల డచెస్ ఉత్సవ్ పేరిట షాపింగ్ మహోత్సవం అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభమైంది. ఈ వేడుకలో నటి సుహాసిని మణిరత్నం, నటి అరుణ, డాక్టర్ ప్రితికా చారి, విద్యా, సాయిలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. డచెస్ క్లబ్‌కు చెందిన నీనారెడ్డి సారథ్యంలో ఫ్యాషన్ దస్తులు, ఆభరణాలు, రుచికరమైన ఆహారం, ట్రెండీ ఉపకరణాలను ప్రదర్శించారు. మంగళవారంతో ఈ ప్రదర్శన ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
టీటీవీ మా వెన్నంటే..!
– నైనార్
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్రకళగం నేత టీటీవీ దినకరన్ ఎన్‌డీఏ కూటమిలోనే ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఎన్‌డీఏ కూటమిలో ఉన్నట్టా..? లేనట్టా..? అని మీడియా ప్రశ్నించగా బీజేపీని అడగాలని దినకరన్ సూచించిన విషయం తెలిసిందే. ఇందుకు నైనార్ సోమవారం సమాధానం ఇస్తూ, ఆయన తమకూటమిలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే, డీఎండీకేను సైతం కూటమిలోకి ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే దినకరన్ మరో అడుగు ముందుకు వేసి అసెంబ్లీ వేరు, లోక్ సభ ఎన్నికలు వేరు అని ఎవరితో పొత్తు అన్నది డిసెంబర్‌లో తాము ప్రకటిస్తామన్నారు. ఇక, డీఎండీకే నేత ప్రేమలత విజయకాంత్ సైతం తనదైన శైలిలో జనవరిలో కూటమి నిర్ణయం అని వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి విజయ్ తమిళగ వెట్రి కళగం కూటమిలో చేరుతారా? అని పన్నీరును ప్రశ్నించగా, భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు అంటూ విజయ్‌కు తన ఆశీస్సులు ఇవ్వడం గమనార్హం.

వర్షాలతో జలకళ