
ట్రాన్స్‌జెండర్ల ధర్నా
సేలం: తమిళనాడు పుదుచ్చేరి ఏకీకృత ట్రాన్స్‌జెండర్ మహిళా సంఘం ఈరోడ్ జిల్లా నాయకురాలు రాధిక పదవీ స్వీకారోత్సవం సోమవారం ఈరోడ్‌లోని ఒక ప్రైవేట్ హాలులో జరిగింది. తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి వందలాది మంది ట్రాన్స్‌జెండర్ మహిళలు ఇందులో పాల్గొన్నారు. నాయకురాలు రాధిక మద్దతుదారులైన చైన్నె, బెంగళూరుకు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర ట్రాన్స్‌జెండర్ మహిళలను అనుచిత పదాలతో దుర్భాషలాడి, చాలా దారుణంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వంద మందికి పైగా ట్రాన్స్‌జెండర్ మహిళలు అకస్మాత్తుగా ఈరోడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఈరోడ్ జిల్లా చైర్‌పర్సన్ రాధిక తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అరాచకానికి పాల్పడిన ట్రాన్స్‌జెండర్ మహిళలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా ఎస్పీ కార్యాలయ ఆవరణలో ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు నిరసన తెలుపుతున్న ట్రాన్స్‌జెండర్‌లను బుజ్జగించే ప్రయత్నం చేశారు. డీఎస్పీ ముత్తుకుమారన్, ఎస్పీ ఇన్‌స్పెక్టర్ రామ్ ప్రభు, టౌన్ ఇన్‌స్పెక్టర్ అనురాధ నిరసన తెలుపుతున్న ట్రాన్స్‌జెండర్ మహిళలతో చర్చలు జరిపారు. ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను వీడారు.