
మురుగన్ సేవలో అన్బుమణి రామదాస్
తిరుత్తణి: పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ శనివారం మధ్యాహ్నం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకున్నారు. రాష్ట్రం కోల్పోయిన హక్కుల కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ శనివారం మధ్యాహ్నం తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి కొండ ఆలయం చేరుకున్నారు. అతనికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రసాదాలు పంపిణీ చేసారు. అన్బుమణి వెంట ఆ పార్టీ శ్రేణులు వందకు పైగా వారు వీఐపీ గేట్ ద్వారంలో స్వామి దర్శనానికి అనుమతి లేకుండా ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. కాగా అన్బుమణి విలేకర్ల సమావేశం కోసం రెండు గంటల పాటు విలేకరులు వేచివుండగా చివరి నిమషంలో విలేకరుల సమావేశం లేదంటూ అన్బుమణి కారులో వెళ్లిపోవడం గమనార్హం. అంతకుముందు శుక్రవారం రాత్రి తిరుత్తణి పట్టణంలో అన్బుమణి పాదయాత్ర చేపట్టి చిత్తూరు రోడ్డు కూడలిలో బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి రావాలన్నది ముఖ్యం కాదని ఎవరు రాకూడదో ముఖ్యంగా పీఎంకే శ్రేణులు కష్టపడి పనిచేసి డీఎంకే ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా పీఎంకేలో తండ్రీ కుమారుల మధ్య నెలకొన్న రాజకీయ పోరాటంతో ఆ పార్టీలో ఇక వర్గం అన్బుమణి సమావేశానికి హాజరుకాకపోవడంతో సమావేశానికి 500కు లోబడిన కార్యకర్తలు మాత్రమే హాజరుకావడం గమనార్హం.