
‘అన్భు’దూకుడు!
● 9న సర్వసభ్య సమావేశానికి నిర్ణయం ● వేదికగా మహాబలిపురం
సాక్షి, చైన్నె: పీఎంకేలో అధికార సమరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా అన్బుమణి దూకుడు పెంచారు. ఈనెల 9వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశానికి పిలుపు నిచ్చారు. మహాబలిపురం వేదికగా ఏర్పాట్ల మీద దృష్టి పెట్టారు. వివరాలు.. పీఎంకేలో నేనంటే..నేనే అధ్యక్షుడ్ని అని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఆయన తనయుడు అన్బుమణి మధ్య జరుగుతున్న రాజకీయ సమరం ఆసక్తికర మలుపుతో సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో అన్బుమణి వెన్నంటి ఉన్న వాళ్లను రాందాసు తొలగిస్తూ, కొత్తవారిని నియమిస్తున్నారు. అయితే, తానే అధ్యక్షుడ్ని అని తొలగించిన వారిని అన్బుమణి మళ్లీ నియమిస్తూ వస్తున్నారు. అదే సమయంలో తన బలాన్ని చాటే విధంగా అన్బుమని వంద రోజుల పాదయాత్రతో దూసుకెళ్తున్నారు. అన్బుమణి వెన్నంటి యువ సమూహం పీఎంకేలో కదులుతుండడంతో ఉత్సాహంగా ఆయన మద్దతుదారులు ఉన్నారు. ఈ పరిస్థితులలో తానేమిటో చాటుకునే విధంగా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా తన తరపున పీఎంకే సర్వ సభ్య సమావేశానికి అన్బుమణి సిద్ధమయ్యారు. మహాబలిపురం వేదికగా ఈనెల9వ తేదీన పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగుతుందని శనివారం అన్బుమణి ప్రకటించారు. మహాబలిపురంలో ఏర్పాట్ల మీద దృష్టి పెట్టే విధంగా నేతలకు సూచనలు చేశారు. అలాగే సర్వసభ్య సభ్యులతో పాటూ పార్టీలో ముఖ్యులు 3 వేల మందిని ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే విధంగా అన్బుమని దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి.అలాగే ఎన్నికలలో పొత్తు ఎవరితో అన్నది తేల్చే దిశగా పలు తీర్మానాలు చేయడానికి సన్నద్దం అవుతున్నట్టు మద్దతు దారులు పేర్కొంటున్నారు.