
ప్రేమ కథా చిత్రంగా ఉసురే
తమిళసినిమా: ప్రేమ లేని సినిమానే ఉండదు. అయితే జీవం ఉన్న ప్రేమ కథా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయి. అలాంటి యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన గ్రామీణ ప్రేమ కథ చిత్రం ఉసురే. డిజయ్ అరుణాచలం, జనని జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా నటి మంత్ర (రాశీ) ముఖ్యపాత్రలో రీఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఆదిత్య కదిర్, తంగదురై, క్రేన్ మనోహర్, సెంథిల్‌కుమారి, పావల్ నవనీతం, మెల్విన్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ ప్రొడక్షన్‌న్స్ పతాకంపై మౌళి ఎం.రాధాకృష్ణ నిర్మించారు. నవీన్ డి గోపాల్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రానికి కిరణ్ జోష్ సంగీతాన్ని, మార్గీసాయి చాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. సాధారణంగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండానే ప్రేమించాల్సి వస్తుంటుంది. అలా స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవలో మిత్రుడొకడు హీరోని ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించి చూపించు అని సవాల్ చేస్తాడు. అతని సవాల్ స్వీకరించిన హీరో ఒక అందమైన యువతిని ప్రేమలో పడేసే ప్రయత్నాలు చేస్తాడు. అయితే అది చివరికి అతను ఆమెను నిజంగానే ప్రేమించే స్థితికి చేరుకుంటాడు. మరి వారి ప్రేమ సుఖాంతమా? కాదా అన్నదే ఉసురే కథ. సాధారణంగా ఒక జంట ప్రేమకు కులాలో, మతాలో, ఆస్తులో, అంతస్తులో అడ్డుగా నిలుస్తాయి. అయితే ఈ చిత్రంలో కథానాయకి తల్లినే ఆటంకంగా మారుతుంది. అది ఎందుకు? ఏమిటి అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే చిత్రం ఉసురే. ఇందులో నటి మంత్ర కథానాయకికి తల్లిగా నటించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రమని దర్శక నిర్మాతలు తెలిపారు.