
ప్రభుత్వ విద్యను కాపాడుకుందాం
వేలూరు: ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వ విద్య, రాజకీయ వ్యవస్థను కాపాడుకుందాం అనే నినాదంతో ఇండియన్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు వేలూరు టీచర్స్ భవనంలో జెండాను ఎగురవేశారు. ముందుగా ఆ సంఘం జిల్లా సమన్వయకర్త జోసెఫ్ అన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు కోల్‌కతాలో జరిగే టీచర్స్ మహానాడు పోస్టర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని అమలు చేయాలని, సెకండరీ పోస్ట్ గ్రాడ్యుయేట్ హెచ్‌ఎంలకు జీతం వ్యత్యాసాలను తొలగించడం, అఖిల భారత సమావేశంలో మహిళలు, బాలికల హక్కలు, రక్షణపై సెమినార్ నిర్వహించాలని, ప్రభుత్వ విద్యను రక్షించాలనే తీర్మానాలు చేశారు. తమిళనాడు హయ్యర్ సెకండరీ స్కూల్ వృత్తి విద్యా టీచర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనార్దన్, తమిళనాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్, జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ సెల్వకుమార్, జిల్లా కార్యదర్శి గుణశేఖరన్, మహిళా బృందం సమన్వయ కర్త సిలంబరసి, జాయింట్ కో–ఆర్డినేటర్ మంజుల, యశోద, జిల్లా ఉన్నత కమిటీ సభ్యులు జయప్రకాష్, ధనశేఖర్, భూపాలన్ పాల్గొన్నారు.