
లాడ్జీలకు పార్కింగ్ వసతి తప్పనిసరి
వేలూరు: వేలూరు జిల్లాలోని హోటల్, లాడ్జి యజమానులు పార్కింగ్ వసతి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ మయిల్‌వాగనం అన్నారు. వేలూరు జిల్లాలోని హోటల్, లాడ్జి యజమానులతో సమీక్షా సమావేశం వేలూరులోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేలూరు పట్టణానికి పర్యాటకంతో పాటూ వైద్య చికిత్స కోసం పలు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్తుంటారన్నారు. వేలూరు పట్టణంలో మాత్రం సుమారు 200కు పైగా లాడ్జిలున్నాయన్నారు. ఈ లాడ్జిలకు వచ్చి వెళ్తున్న వారి వివరాలను తెలుసుకునేందుకు వారి ఆధార్ కార్డు, పూర్తి చిరునామాతో పాటూ ఏ కారణంతో వేలూరుకు వచ్చారు అనే పూర్తి వివరాలను సేకరించాలన్నారు. గతంతో నోటు పుస్తకాల్లో రాసుకునే వాటిని ఇకపై ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను పోలీస్ స్టేషన్‌ల ద్వారా అందజేస్తామన్నారు. వీటి వల్ల లాడ్జికి వచ్చిన వారు ఎక్కడకు వెళ్తున్నారు. ఏ పనిమీద వెలుతున్నారు అనే పూర్తి విషయాలు పోలీసులకు తెలుస్తుందన్నారు. వీటి వల్ల నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. పోలీసులకు, లాడ్జి యజమానులకు ఈ ఈ విధానం వల్ల మంచి సంబంధాలు ఉంటుందన్నారు. లాడ్జిలకు బయట రోడ్డు పక్కన పబ్లిసిటీ బ్యానర్‌లు, బోర్డులు పెట్టరాదన్నారు. అదే విధంగా లాడ్జిలకు పార్కింగ్ వసతి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎటువంటి ట్రాఫిక్ సమస్య రాదన్నారు. వాహనాలు ఎక్కడబడితే అక్కడ రోడ్డుపై వదిలి వెళ్లడం ద్వారా ట్రాఫిక్ సమస్యతో తరచూ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వేలూరు జిల్లాలోని లాడ్జి, హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు ఇందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కరన్, డీఎస్పీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్‌లు, హోటల్ యజమానుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.