
క్లుప్తంగా
విద్యార్థులలో నాయకత్వ
లక్షణాలు అవసరం
సాక్షి, చైన్నె: విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత పెరగాలని ఏవీఐటీ చాన్స్‌లర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ అనురాధా పిలుపు నిచ్చారు. ఆరుపడై వీడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2025–26 సంవత్సరం తొలి బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఇందులో గణేషన్, అనురాధా గణేషన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమగ్రత, ఆవిష్కరణలు, సమ్మిళితత్వం, విలువల గురించి వివరించారు. సమాజ మార్పులో విద్యా పాత్రను గురించి తెలియజేశారు. నాస్కామ్ డైరెక్టర్ వి ఉదయ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులలో ప్రతిధ్వనించే శక్తివంతమైన అంశాలను, వృత్తి పరమైన ప్రయాణం గురించి వివరించారు. పరిశ్రమ, ఏఐ, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ గురించి విశదీకరించారు. కార్యక్రమంలో ఏవీఐటీ నిర్వహణ బోర్డు సభ్యుడు సురేష్ శామ్యూల్, ప్రిన్సిపల్ డాక్టర్ జే జనత్, డైరెక్టర్ జీ సెల్వకుమార్, ఉపకులపతి డాక్టర్ పీకే సుదీర్, ప్రో ఉపకలపతి డాక్టర్ శబరి నాథన్, రిజిస్టార్ డాక్టర్ ఎ. నాగప్పన్, డిప్యూటీ రిజిస్టార్ పి. రాజశేఖరన్, పి. కార్తికేయన్, అడ్మిషన్స్ అధికారి నూర్జహాన్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.
కారులో అకస్మాత్తుగా మంటలు
– ప్రాణాలతో తప్పించుకున్న బాధితులు
తిరువొత్తియూరు: పెరుంగళత్తూరు ప్రాంతంలో నడిరోడ్డుపై కారులో మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అందులో నుంచి దిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. తూర్పు తంజావూ రు జిల్లా, పుదుక్కోట సమీపంలోని తిరుచ్చిట్రంబలం ప్రాంతానికి చెందిన అయ్యప్పన్ (34) తన కుటుంబంతో కలిసి కారులో చైన్నెకి బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో పెరుంగళత్తూరు సమీపంలోకి రాగానే, అతని కారు ముందు భాగం నుంచి పొగ వచ్చింది. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, అయ్యప్పన్, అతని కుటుంబానికి చెందిన నలుగురు కారులోంచి దిగిపోయారు. ఆ తర్వా త కొద్దిసేపటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పీర్కన్ కరణై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ బస్సు ఢీకొని
టీచర్ మృతి
అన్నానగర్: ఈరోడ్ సమీపంలోని చెట్టిపాళయం ప్రాంతానికి చెందిన శేఖర్. ఇతని కుమార్తె మిర్తియంక (21). మూలపాళయం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కిండర్ గార్టెన్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం, ఎప్పటిలాగే, మిర్థియంక తన ద్విచక్ర వాహనం పై ఇంటికి నుంచి మూలపాళయం పాఠశాలకు బయలుదేరింది. అన్నామార్ పెట్రోల్ పంప్ ప్రాంతం సమీపంలో ప్రైవేటు బస్సు మిర్తియంక స్కూటీని ఢీకొట్టింది. ఆమె అక్కడికక్కడే తల నుజ్జునుజ్జు అయి, రక్తస్రావంతో మరణించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యా యురాలి మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసు కుని ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ను విచారిస్తున్నారు.
మారియమ్మన్ ఆలయ హుండీ
ఆదాయం రూ.1.21 కోట్లు
అన్నానగర్: సమయపురం మరియమ్మన్ ఆలయ హుండీ లెక్కింపు గురువారం చేపట్టారు. కోటి 27 లక్షల 31 వేల 398 రూపాయల నగదు, 1.535 గ్రాముల బంగారం, 4 కిలోల 405 గ్రాముల వెండి కానుకలు అందినట్లు ఆలయ నిర్వాహుకులు వెల్లడించారు. వివరాలు.. శక్తి ఆలయాలలో అగ్రగామిగా ఉన్న తిరుచ్చి సమయపురం మారియమ్మన్ ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. కాగా భక్తులు సమర్పించిన కానుకలను బ్యాంకులోని ఆలయ ఖాతాకు జమ చేసినట్లు ఆలయ జాయింట్ కమిషనర్ ప్రకాష్ తెలిపారు.
చిన్నారిపై లైంగిక వేధింపులు
– తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించడంతో కలకలం
అన్నానగర్: తిరుప్పూర్‌లోని కెవిఆర్ నగర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ పాఠశాల నడుస్తోంది. ఈ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్థితిలో ఇక్కడ 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలిక బుధవారం సాయంత్రం టాయిలెట్‌కు వెళ్లింది. ఆ సమయంలో టాయిలెట్ శుభ్రం చేస్తున్న అస్సాంకు చెందిన ఒక యువకుడు ఆ బాలికను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తరగతి ఉపాధ్యాయురాలికి చెప్పింది. అయితే ఆమె సరైన చర్య తీసుకోలేదని తెలుస్తుంది. దీని తర్వాత, ఆ బాలిక సాయంత్రం తన తల్లికి పొత్తి కడుపులో నొప్పిగా ఉందని చెప్పి, పాఠశాలలో జరిగిన ఘటన గురించి కూడా చెప్పింది. దీంతో ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు, సాధారణ ప్రజలు ప్రైవేట్ పాఠశాలను చుట్టుముట్టి, బాలికను లైంగికంగా వేధించిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేసి నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న కేవీఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ జాన్ సహా పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ఆ తరువాత, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన అస్సాంవాసి జయ్ (27) పై సౌత్ ఆల్ ఉమెన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.