
కూలి కాంబో రిపీట్?
తమిళసినిమా: నటుడు రజనీకాంత్ ఇటీవల తనకు నచ్చిన దర్శకులతో మళ్లీ చిత్రం చేయడానికి ఇష్టపడుతున్నారా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వార్గల నుంచి వస్తోంది. ఇంతకు ముందు వరుస ప్లాప్‌లలో ఉన్న రజనీకాంత్‌ను అందులోంచి బయట పడేసిన చిత్రం జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. కాగా జైలర్ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దానికి స్వీకెల్‌లో అదే దర్శకుడితో రజనీకాంత్ చిత్రం చేస్తున్నారు. ఇకపోతే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం కూలి. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి చిత్రం ఇది. రజనీకాంత్‌తో పాటూ బాలీవుడ్ సూపర్‌స్టర్ అమీర్‌ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, నటి శృతీహాసన్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి పూజాహెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరవనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌లను ఆగస్ట్ రెండవ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే చిత్రాన్ని ఆగస్ట్ 14న తెరపైకి తీసుకువస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు. కాగా రజనీకాంత్ తరుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అదే విధంగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్, లోకేశ్ కనకరాజ్ కాంబో రిపీట్ కానుందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన కథను కూడా లోకేశ్ కనకరాజ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఏవరన్నది తెలియడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇప్పుడు చాలా బిజీ. ఈయన ఒక పక్క దర్శకుడిగానూ, నిర్మాతగానూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో నటుడిగా పరిచయం అవ్వడానికి సిద్ధం అవతున్నారన్నది తాజా సమాచారం. ఈయన అరుణ్‌మాదేశ్వరన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదేవిధంగా నటుడు అమీర్‌ఖాన్ హీరోగా ఒక హిందీ చిత్రం ,కార్తీ హీరోగా ఖైదీ– 2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇకపోతే నటుడు సూర్య హీరోగా, అజిత్ హీరోగా చిత్రాలు చేయలన్న కోరికను దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఇటీవల వ్యక్తం చేశారు. దీంతో రజనీకాంత్‌తో మళ్లీ ఎప్పుడు చిత్రం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ ప్రచారం మాత్రం రజనీకాంత్ అభిమానుల్లో మంచి జోష్‌ను నింపుతోందన్నది నిజం.