
వేలూరులో ట్రాఫిక్ సమస్యపై డీఐజీ సమీక్ష
వేలూరు: వేలూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై వేలూరు డీఐజీ ధర్మరాజ్ రోడ్డు భద్రతా సంఘం, ఇండియన్ రెడ్‌క్రాస్ సంఘం ప్రతినిధులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ వేలూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సభ్యులు సలహాలు, సూచలను ఇవ్వాలన్నారు. అదే విధంగా ట్రాఫిక్ రద్దీతో పాటూ ప్రమాదాల నివారణ మార్గాలు తెలపాలన్నారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని వేలూరు, కాట్పాడి వంటి ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో తరచూ ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడకుండా ఇండియన్ రెడ్‌క్రాస్ సభ్యులు, రోడ్డు భద్రతా దళం సభ్యులు ఎస్పీ మయిల్‌వాగనంకు తరచూ సలహాలు సూచలను అందజేస్తే వాటిని పాటించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఇకపై చేయాల్సిన పనులు తదితర వాటిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం సభ్యులు డీఐజీ ధర్మరాజ్‌కు రోడ్డు భద్రతా నియమావళి గురించి ఓ వినతిపత్రాన్ని సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మయిల్ వాగనం, అదనపు ఎస్పీ భాస్కరన్, రోడ్డు భద్రతా దళం కార్యదర్శి డాక్టర్ ఏఎం ఇక్రమ్, ఉపాధ్యక్షులు రమేష్‌కుమార్ జైన్, శ్రీనివాసన్, రామచంద్రన్, ఉపకార్యదర్శి శాంతి బాస్కరన్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు జనార్దనన్, డాక్టర్ దీనబందు, ప్రిన్సిపల్ శివకుమార్ తదితరులున్నారు.