
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘హౌస్‌మేట్స్’
తమిళసినిమా: సినిమాలో కొత్తదనం ఉంటేనే అది పెద్దదైనా, చిన్నదైనా ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు వెళ్లే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ప్రేక్షకులు ఆదరించిన చిత్రమే పెద్దది అని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంటున్న పరిస్థితి. ఇకపోతే ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న పరిస్థితి .ప్రేక్షకులు వైవిద్యాన్ని కోరుకుంటున్నారన్నదానికి ఇదే ఉదాహరణ. కాగా తాజాగా అలాంటి ఇతి వృత్తంతో కూడిన చిత్రం హౌస్‌మేట్స్. ఇదేంటి క్లాస్‌మేట్స్ గురించి, రూమేట్స్ గురించి విన్నాం, హౌస్‌మేట్స్ ఏమిటీ అని అనుకుంటున్నారా? అదే ఈ చిత్ర కథ ప్రత్యేకత. రెండు కుటుంబాలు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకే ఇంటిలో నివశిస్తుంటారు. అదేలా సాధ్యం అన్నదే ఆసక్తికరమైన విషయం. నటుడు దర్శన్, కాళీవెంకట్, అర్షా చాందిని బైజూ, వినోదిని, దీనా, అబ్దుల్‌లీ, మాస్టర్ హెండ్రిక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రే స్మిత్ స్టూడియోస్, సౌత్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఎస్‌పీ శక్తివేల్ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహిరించిన ఈ చిత్రానికి టీ.రాజవేల్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఎంఎస్.సతీశ్ ఛాయాగ్రహణం, రాజేశ్ మురుగేశన్ సంగీతాన్ని అందించారు. కాగా చిన్న చిత్రాలను ప్రోత్సహించే నటుడు శివకార్తికేయన్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం మరో విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న హౌస్‌మేట్స్ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని కాబోయే మామ హీరోకు కండిషన్ పెట్టడంతో అతను సంపాందించినదంతా ఖర్చు పెట్టి ఓ ఆపార్ట్‌మెంట్ కొనుగోలు చేస్తాడు. అయినా మామ పెళ్లికి ఆటంకాలు పెట్టడంతో ప్రేమికులు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కొత్తగా కొన్న ఇంటిలో కాపురం పెడతారు. అయితే అప్పటికే ఆ ఇంటిలో మరో కుటుంబం కాపురం ఉంటుంది. కానీ ఈ రెండు కుటుంబాలు ఒకరికి ఒకరు కనిపించరు. ఎందుకనీ, వారి కథ ఏమిటి అనే ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం హౌస్‌మేట్స్ అని నిర్మాతలు వెల్లడించారు.